ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి

11 Sep, 2018 13:29 IST|Sakshi

సాక్షి, కొండగట్టు: అంజన్న దర్శనం పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న భక్తుల ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఈ ఘోరప్రమాదంలో 57 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరికొంత మందికి తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పుత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 88 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘాట్‌ రోడ్‌ వద్ద బస్సు మలుపు తిప్పుతున్నప్పుడు ప్రయాణికులు ఒక వైపే ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి వుంటుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు.

మంగళవారం కూడా కావడంతో కొండగట్టుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ.. బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీ 28 జెడ్‌ 2319 నంబర్‌ ఆర్టీసీ బస్సు​ 88మందితో శనివారంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరింది. రెగ్యులర్‌ డ్రైవర్‌ కాకుండా కొత్త డ్రైవర్‌ బస్సును నడిపిస్తున్నారు. డ్రైవర్‌ మలుపులను అంచనా వేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే విధంగా ఘాట్‌ రోడ్డు వెడల్పు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికలు పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రహదారులను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం స్థలం వద్ద మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 
 

మరిన్ని వార్తలు