11 Sep, 2018 16:38 IST|Sakshi

సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్‌ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో  వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది.  ఘోర రోడ్డు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారుల సమాచారం. సంఘటనా స్థలానికి బస్సు చేరుకునే సమయానికి కండక్టర్‌ 82 మందికి టికెట్‌ ఇచ్చారు. మిగతావారికి టికెట్‌ ఇవ్వాల్సి ఉంది. అంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది.  జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్‌ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్‌డేట్స్‌...

సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సుప్రమాదం కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ హనుమంతరావుపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులు వారికి వివరించారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారికి పూర్తి చికిత్స అందించడంతోపాటు అండగా ఉంటామని కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
సాయంత్రం 5.30 గంటలు: కొండగట్టు బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాయంత్రం 4.30 గంటలు: కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన తమవారు.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారిని మృత్యువు కబళించడంతో.. అయినవారు, ఆత్మీయులు బంధువులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మహిళలు గుండెలు బాదుకొని రోదిస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. 

కొండంత విషాదం.. ఎవరిది నిర్లక్ష్యం.. ఎన్నెన్నో ప్రశ్నలు.. చదవండి కొండగట్టు బస్సుప్రమాదంపై పూర్తి కథనాలు

అంజన్న భక్తులకు విషాదం
ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి
దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!
కొండగట్టు ప్రమాదం: డ్రైవర్‌ తప్పిదం వల్లే?

సాయంత్రం 4 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై తెలుగులో, ఆంగ్లంలో ఆయన ట్వీట్‌ చేశారసు.

మధ్యాహ్నం 3.30 గంటలు: కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆమె కోరారు.

మధ్యాహం 3 గంటలు: కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో పసిపిల్లలు కూడా ఉన్నారని, గాయపడిన పిల్లలు అత్యవసరస్థితిలో ఉంటే ఆసుపత్రులు వారిని వెంటనే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు పేదవారైతే వారికి అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటలు: జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, మంత్రి మహేందర్‌రెడ్డి.. మరికాసేపట్లో హెలికాప్టర్‌లో వెళ్లనున్న నేతలు

మరిన్ని వార్తలు