మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

14 Sep, 2019 10:45 IST|Sakshi
డీఎస్పీ విడుదల చేసిన దొంగల ఫొటోలు

సాక్షి, పెరవలి(పశ్చిమగోదావరి) : తణుకు పరిసర ప్రాంతాల్లో చైన్‌ స్కాచింగ్‌ చేసే 30 మంది మహిళా దొంగలు ఉన్నారని, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని, వారు కనబడితే సమాచారం ఇవ్వాలని కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెరవలి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వచ్చిన ఆయన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా దొంగలు రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ఎక్కి మహిళల మెడలో ఉండే వస్తువులను ఎంతో చాకచక్యంగా దొంగిలిస్తారని తెలిపారు. అదే నిర్మానుష ప్రాంతాలైతే దాడులకు కూడా తెగబడతారని హెచ్చరించారు. నగలు వేసుకుని ఒంటరిగా వెళ్లవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, వాహనదారులు కూడా సహకరించాలని  తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి గ్రామం వద్ద స్పీడ్‌ కంట్రోల్‌ చేసే స్టాపర్లు ఏర్పాటు చేశామని దీనివల్ల ప్రమాదాలు తగ్గాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ వినియోగించాలని, లేనిపక్షంలో జరిమానా తప్పదని, దీనివల్ల ప్రయాణికులకే భద్రత ఉంటుందన్నారు. పెరవలి పోలీస్‌స్టేషన్‌ రికార్డుల నిర్వహణ బాగుందని, సిబ్బంది పనితీరు కూడా బాగానే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వైబీ కిరణ్‌ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు