చోరీలకు ముందు.. ఓ దొంగ నేరచరిత్ర విచిత్రం..

14 Dec, 2019 07:38 IST|Sakshi
పేరుమోసిన దొంగ కూచిపూడి లక్ష్మణ్‌

సరిగ్గా ఒంటి గంట తర్వాతే చోరీలు

దొంగతనానికి ముందు 90 ఎంఎల్‌ మద్యం తాగాల్సిందే

మాస్క్‌లు..గ్లోవ్స్‌..చెప్పులు లేకుండానే ముందుకు...

చోరీలు నేర్పించిన గురువు కోసం రూ.65 వేలు దోపిడీ

టీవీ, వంటసామగ్రి కొనిచ్చిన వైనం జైలులో ఇతనితోనే

నీతి పాఠాలు బోధించిన పోలీసులు

బంజారాహిల్స్‌: కూచిపూడి లక్ష్మణ్‌ అలియాస్‌ మాధవ్‌అలియాస్‌ మధు(32). నగరంలోనే పేరుమోసిన దొంగ. నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఇప్పటివరకు వంద దొంగతనాలు పూర్తిచేశాడు. ఇటీవల తనకు చోరకళలో  మెళకువలు నేర్పిన గురువుకు టీవీతో పాటు నిత్యావసర సరుకులు, గ్యాస్‌పొయ్యి కొనిచ్చి గురుదక్షిణ సమర్పించుకునేందుకు దొంగతనం చేశాడు. తన అవసరాల కోసం ఇంకో దొంగతనం చేయబోతూ బంజారాహిల్స్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కాడు. ఈ దొంగ గురించి ఆరాతీసిన పోలీసులకు ఎన్నో అవాక్కయ్యే విషయాలు...విడ్డూరాలు..సెంటిమెంట్లు బయటపడ్డాయి. దొంగల్లో ఈ దొంగ రూటే సెపరేటని పోలీసులు అన్ని విషయాలు బయటపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే... కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహ్మద్‌పేట గ్రామానికి చెందిన కూచిపూడి లక్ష్మణ్‌ మొదటి దొంగతనం 2006 డిసెంబర్‌ 18న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైంది. బైక్‌ దొంగిలించి పట్టుబడ్డాడు. బైక్‌పై జాలీగా తిరగాలన్న ఉద్దేశంతో ఆ తరువాత వరుసగా మూడు సార్లు బైక్‌లు దొంగిలించాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. దీంతో డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతూ ఇప్పటిదాకా పోలీసు రికార్డుల ప్రకారం 30 దొంగతనాలు నమోదు కాగా రికార్డులకెక్కనవి ఇంకో 70 దొంగతనాలు ఉంటాయని తేలింది. ఇటీవల తనకు దొంగతనం చేయడంలో విద్యలు నేర్పిన మరో గజదొంగ ఇబ్రహిం సిద్దీఖిని గుల్బార్గాలో కలిసేందుకు వెళ్లాడు. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయాడు. కాలక్షేపానికి టీవీ కూడా లేదని తెలుసుకుని ఈనెల 2వ తేదీన యూసుఫ్‌గూడాలోని మెడికల్‌షాపు షట్టర్‌ లిఫ్ట్‌చేసి కౌంటర్‌లో ఉన్న రూ.65 వేలు దొంగిలించి ఆ మొత్తంతో తన గురువు సిద్దీఖికి టీవీతో పాటు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, గ్యాస్‌ కొనిచ్చాడు. తన అవసరాల కోసం మరో దొంగతనం చేస్తూ ఈనెల 10న పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది నవంబర్‌ 17వ తేదీన బంజారాహిల్స్‌ పోలీసులు పీడీ యాక్టు కింద లక్ష్మణ్‌ను జైలుకు తరలించారు. గత నెల 16వ తేదీన విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. బంజారాహిల్స్‌లో 5, ఎస్‌ఆర్‌నగర్‌లో 9, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు మిగతా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఇంకో 20 దొంగతనాల కేసులు నమోదైవున్నాయి. అలా జైలుకు వెళ్లి ఇలా బయటకురాగానే మళ్లీ దొంగతనాలు మొదలుపెడుతున్నాడు. 

ఒంటిగంట సెంటిమెంటు...
లక్ష్మణ్‌ దొంగతనాలు చేయడానికి అర్థరాత్రి ఒంటిగంట సెంటిమెంటుగా పెట్టుకుంటాడు. ఆ తరువాతనే ఇంట్లో నుంచి బయటకు వెళతాడు. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి.. తనతో పాటు తెచ్చుకునే స్క్రూడైవర్, రాడ్‌తో తలుపు పగులగొట్టి లోనికివెళ్లి దొరికిందంతా సర్దుకుని వస్తాడు. చోరీసొత్తును విక్రయించి ఆ డబ్బుతో మద్యం సేవించడం, తనకున్న ఇద్దరు ప్రియురాళ్లతో సరిపెడుతుంటాడు.

ఏ గ్యాంగ్‌లో లేను...
తాను చెడ్డీగ్యాంగ్, మరాఠా గ్యాంగ్‌ ఇలా ఎందులోనూ ఉండనని సింగిల్‌గానే చోరీకి వెళ్తుంటానని పేర్కొన్నాడు. దొంగతనానికి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేలిముద్రలు, కాలిముద్రలు దొరక్కుండా కారప్పొడి చల్లడం ఇలాంటివేవి పెట్టుకోనని పేర్కొన్నాడు. మాస్క్, గ్లౌజులు తొడుక్కుని చోరీ చేస్తే పోలీసులు ఇంకా బాగా కొడతారని వెల్లడించాడు. 

జనజీవన స్రవంతిలో...
తనకు కూడా మంచి జీవితం గడపాలని ఉందని అయితే డబ్బులు సరిపోకపోవడంతో తప్పనిసరిగా దొంగతనాలు చేస్తుంటానని వెల్లడించాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ దొంగతనాలవైపే తన మనసు మొగ్గు చూపిస్తుంటుందని పేర్కొన్నాడు. దొంగతనం చేసిన తరువాత బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లో ఒక్కరోజంతా ఉంటానని, ఆ తెల్లవారి పత్రికలు చూసి చోరీ సొత్తు ఎంత పోయిందో తెలుసుకుంటానని వెల్లడించాడు. చాలాసార్లు దొంగిలించిన సొత్తు కంటే ఎక్కువగా పోయిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొంటారని, అది చూసి ఆశ్చర్యపోతుంటానని అన్నాడు. 

90ఎంఎల్‌ తాగాల్సిందే..!
దొంగతనానికి వెళ్లేముందు తప్పనిసరిగా 90ఎంఎల్‌ మద్యం తాగడం సెంటిమెంట్‌గా ఉందని లక్ష్మణ్‌ చెప్పాడు. తాగిన మత్తులోనే దొంగతనం తేలిగ్గా చేయగలుగుతానని వెల్లడించాడు. శుక్రవారం లక్ష్మణ్‌ను బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ‘సాక్షి’ పలకరించగా..మరికొన్ని విషయాలు ఇలా వెల్లడించాడు.

జైలులో పాఠాలు...
తనకు చంచల్‌గూడ జైలుతో 2006 నుంచి అనుబంధం ఉందని, అక్కడంతా తనను గుర్తుపడతారని వెల్లడించాడు. 450 మంది ఖైదీలకు తాను పాఠాలు చెబుతుంటానని, జైలులో తనకన్నా సీనియర్లు మరో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉంటారని అందర్నీ సమావేశపరిచి వారికి నీతి పాఠాలు బోధించాలని అధికారులు తననే పురమాయిస్తుంటారని వెల్లడించాడు.

మరిన్ని వార్తలు