పక్కాగా రెక్కీ.. ఆపై చోరీ

9 Mar, 2020 09:12 IST|Sakshi
నిందితుడు కుంచం కోటి

మూడు రకాలైన దొంగతనాలే లక్ష్యం

గతంలోనూ ఆరు కేసులు నమోదు

నిందితుడిని పట్టుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నిఘా కళ్లకు చిక్కకుండా సందులూ గొందుల్లో సంచరిస్తూ, పక్కాగా రెక్కీ చేసి ఆపై చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు కుంచం కోటిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్, వాహన చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నట్లు ఆదివారం డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. నిందితుడు కోటి నుంచి రూ.1.2 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

డీసీపీ వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన కోటికి బంటి, ఈశ్వర్‌ అనే మారు పేర్లూ ఉన్నాయి. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఇతగాడు జియాగూడలో స్థిరపడ్డాడు. కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తూ దురవాట్లకు బానిసయ్యాడు. తనకు వచ్చే సంపాదనతో జల్సాలు చేయడం సాధ్యం కాకపోవడంతో దొంగతనాల బాటపట్టాడు. 2016 నుంచి చోరీలు చేయడం ప్రారంభించాడు. గతంలో టప్పాచబుత్రా, కాచిగూడ, మాదాపూర్, నార్సింగ్‌ ఠాణాల్లో ఇతడిపై ఆరు కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారాల్లో సీసీ కెమెరాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇతగాడు ఎక్కువగా చిన్న రూట్లు, సందుల్లో సంచరిస్తూ  ఉంటాడు. ఓ ప్రాంతంలో నేరం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత పక్కాగా రెక్కీ నిర్వహిస్తాడు.

స్నాచింగ్‌ లేదా చోరీ చేసిన తర్వాత ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తాడు. ఆపై ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ఎదురు చూస్తాడు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామునే రంగంలోకి దిగే ఇతగాడు ఫోన్‌లో మాట్లాడే వారిని గుర్తిస్తాడు. వేగంగా వాహనంపై అతడి వద్దకు వెళ్లి ఫోన్‌ లాక్కుని ఉడాయిస్తాడు. అవకాశం చిక్కితే ఇళ్లల్లో చోరీలు, వాహనాల దొంగతనాలు కూడా చేస్తుంటాడు. ఇటీవల సైఫాబాద్, ఆసిఫ్‌నగర్‌ ఠాణాల పరిధుల్లో రెండు సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్, ఓ వాహన చోరీ, మరో ఇంట్లో దొంగతనం చేశాడు. కోటిని పట్టుకోవడానికి మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షరీఫ్, టి.శ్రీధర్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆదివారం నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేసింది. తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించింది.

మరిన్ని వార్తలు