కర్నూలు లైంగికదాడి కేసు సీబీఐకి..

12 Feb, 2020 04:03 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

కేసు ఫైల్స్‌ను హోంశాఖ కార్యదర్శికి నివేదించాం

కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడి  

కర్నూలు:  కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 2017లో జరిగిన పదోతరగతి విద్యార్థిని లైంగికదాడి, హత్య అభియోగాలు ఉన్న కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసి న్యాయం చేయాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో వినతిపత్రం సమర్పించారన్నారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్‌ 21వ తేదీన కేసు తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయన్నారు. అప్పటికే కేసు ట్రయల్‌లో ఉన్నప్పటికీ కోర్టులో జడ్జి అనుమతి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

నిజాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో అడిషనల్‌ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీం (సిట్‌) అత్యాధునిక సాంకేతిక సహాయంతో దర్యాప్తు చేపట్టిందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితురాలి కుటుంబీకులు, దళిత సంఘాల డిమాండ్‌తో డీజీపీ సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిందిగా సిఫారసు చేస్తూ డీజీపీకి నివేదించగా తదుపరి చర్యల నిమిత్తం వాటిని హోం సెక్రటరీకి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు