పోలీసుల అదుపులో టీడీపీ నగర కార్యదర్శి 

27 Jun, 2019 06:48 IST|Sakshi

సాక్షి, కర్నూలు : టీడీపీ నాయకుల తీరు మారడం లేదు. అక్రమ సంపాదనకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మట్కాడాన్‌ అసదుల్లా తనయుడు, టీడీపీ నగర కార్యదర్శి అబ్బాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కర్నూలు బుధవార పేటలోని పాత ఇంటిపై మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు  పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్పీ క్రైం పార్టీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి వెనుక వైపు నుంచి పై అంతస్తులోకి వెళ్లారు. అక్కడ ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల సాయంతో ఆన్‌లైన్‌ ద్వారా మట్కా నిర్వహిస్తున్న అబ్బాస్‌తో పాటు మరో ఇద్దరు బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదుతో పాటు మట్కా చీటీలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల దాడికి పది నిమిషాల ముందు మట్కాడాన్‌ అసదుల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్న సమాచారం తెలుసుకుని అటు నుంచి అటే పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది.  

జైలు జీవితం గడిపినా.. 
అసదుల్లాపై కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో  26 కేసులు ఉన్నాయి.  ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్‌ ప్రాంతాల్లోని కేసులతో కలిపి  50 పైగానే నమోదయ్యాయి. మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ (షీట్‌ నెంబర్‌ 57) కూడా ఉంది. 2015లో బుధవార పేటలో జరిగిన హత్య కేసులో అసదుల్లాతో పాటు అతని కుమారుడు అబ్బాస్‌ కూడా నిందితుడు. మట్కా నిర్వహణలో ఇతనికి జిల్లాలో  డాన్‌గా గుర్తింపు ఉంది. 100 మందికి పైగా బీటర్లను నియమించుకుని నిరంతరాయంగా మట్కాతో పాటు కుమారుల ద్వారా బెట్టింగ్‌ కార్యకలాపాలు  కూడా నిర్వహిస్తుంటారు. అబ్బాస్‌ తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శిగా ఉన్నాడు. ‘పెద్దల’ సభలో ఉన్న అప్పటి టీడీపీ నాయకుడికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ అక్రమ సంపాదన కోసం మట్కా, మొబైల్‌ పేకాట, బెట్టింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు.

గతేడాది డిసెంబర్‌ 13న ఎస్పీ స్పెషల్‌ పార్టీ పోలీసులు.. ఇంటిపై దాడిచేసి అసదుల్లాతో పాటు మరో 9 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.10 లక్షల నగదుతో పాటు 11.5 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అబ్బాస్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ముఖ్య నాయకుడి రాయ‘బేరం’తో మట్కా కేసు నుంచి అప్పట్లో విముక్తి కల్పించారు. అయితే.. గత ఏడాది డిసెంబర్‌ 20న అసదుల్లాపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి కడప సెంట్రల్‌  జైలుకు తరలించారు. అతను అనారోగ్య కారణాలు సాకుగా చూపి మార్చి రెండో వారంలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. సుమారు రెండున్నర నెలల పాటు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా తిరిగి తన మట్కా సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా నడిపిస్తున్నాడు.  

ఆన్‌లైన్‌ ద్వారా జూదం 
కర్నూలు నగరంలో మట్కా మూడు ఓపెన్లు.. ఆరు క్లోజ్‌లుగా విరాజిల్లుతోంది. చుట్టుపక్కల పల్లెల్లోనూ అసదుల్లా తన అనుచరులను బీటర్లుగా నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ జూదంలో పేరుగాంచిన పాత బస్తీ బ్రదర్స్‌ ఒకవైపు, అసదుల్లా మరోవైపు నగరాన్ని విభజించుకుని మట్కా నిర్వహిస్తున్నారు. అనుకూలమైన పోలీసులతో చేతులు కలిపి నెల, వారాంతపు మామూళ్లు ముట్టజెప్పి జూదాన్ని నడిపిస్తున్నారు. చాంద్‌ టాకీస్‌ కాంప్లెక్స్‌ అడ్డాగా చేసుకుని పాత బస్తీ బ్రదర్స్‌ దుకాణాన్ని తెరిచారు. అసదుల్లా మాత్రం బుధవార పేటలోని తన ఇంటితో పాటు సమీప కాలనీలలో మరో రెండు ‘డెన్‌’లు ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో చీటీల ద్వారా మట్కా రాసుకునే వారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.   

రోజుకు రూ.2 కోట్ల టర్నోవర్‌ 
కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, సి.బెలగళ్, ఆదోని, వెల్దుర్తి, నంద్యాల, కోవెలకుంట్ల, కిష్టిపాడు, దొర్నిపాడు ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ద్వారా జోరుగా మట్కా నడుస్తోంది. రోజుకు రూ.2 కోట్లు చేతులు మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీనివల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. నిర్వాహకులు పదికి వంద, వందకు వెయ్యి,  వెయ్యికి రూ.పదివేలు.. ఇలా ఆశ పెట్టి అమాయకులను దోచుకుంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయి.. నష్టపోకుండా ఉండేందుకు మట్కాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కఠినంగా ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీస్‌ బాస్‌.. మట్కా నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు.  


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు