రక్షణ లేని లేడీస్‌ హా..స్టళ్లు

20 Apr, 2019 12:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు

రక్షణ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు

కళాశాల అనుమతి పత్రాలు లేకుండా చేర్చుకుంటున్న నిర్వాహకులు

ఆకతాయి మహిళలకూ హాస్టళ్లలో వసతి

పేద విద్యార్థినులను వ్యభిచారకూపంలోకి నెడుతున్న వైనం

అధికారులు, పోలీసుల పర్యవేక్షణ కరువు

జిల్లావ్యాప్తంగా 300కు పైగా లేడీస్‌ హాస్టళ్లు

ఓ ప్రైవేటు సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పని చేసేందుకు ఓ యువతి పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చింది. ఇక్కడ ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. వచ్చే జీతంలో ఖర్చులు పోగా నామమాత్రంగానే చేతిలో మిగులుతోంది. ఆ డబ్బును కూడా ఇంటికే పంపించేది. ఇక చేతిలో ఖర్చులకు చిల్లిగవ్వ ఉండటం లేదు. అదే  హాస్టల్‌లో ఉంటున్న తోటి యువతి ఆమెను ఎలాగైనా తన మాదిరిగానే పడుపు వృత్తిలోకి దించాలని నిర్ణయించుకుంది. తన దగ్గర ఖరీదైన సెల్‌ఫోన్, బట్టలు, చేతి నిండా డబ్బును చూపుతూ ప్రలోభ పెట్టింది. ‘నీవు కూడా ఎంతకాలం డబ్బుకు ఇబ్బందులు పడతావు... నేను చెప్పినట్లు వింటే కోరినంత డబ్బు వస్తుం’దంటూ ఆశ పెట్టడంతో సదరు యువతి కొద్ది రోజులకు సరేనంది. ఉద్యోగం మానేసి ఆమెతో కలసి వ్యభిచార కూపంలోకి దిగింది. జీవితాన్ని నాశనం చేసుకుంది.

గుంటూరు: అనుమతులు ఉండవు.. నిబంధనలు అసలే పట్టవు.. రక్షణ చర్యలు ఏమాత్రం తీసుకోరు.. ధనార్జనే వారి ధ్యేయం.. ఇందుకోసం విద్యార్థినుల జీవితాలు నాశనమైనా వారికి చీమకుట్టినట్లైనా ఉండదు..  నెలవారీ మామూళ్లతో అధికారులు, పోలీసుల్ని మేనేజ్‌ చేస్తూ కొందరు యథేచ్ఛగా లేడీస్‌ హాస్టళ్లను కొనసాగిస్తున్నారు. రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు నుంచి వచ్చిన విద్యార్థినులు, ఉద్యోగాలు కోసం వచ్చే యువతులు లేడీస్‌ హాస్టళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్, బీఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థినులు ఆయా కళాశాలల్లో వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టళ్లను వెతుక్కోవాల్సి వస్తోంది. కొన్ని కళాశాలల్లో సౌకర్యం ఉన్నప్పటికీ భోజనం బాగోలేదనో, వసతులు సక్రమంగా లేవనే కారణాలతో అధిక శాతం మంది విద్యార్థినులు ప్రైవేట్‌ హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వాటి నిర్వాహకులు సైతం విద్యార్థినుల్ని ఆకర్షించేలా అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని అందులో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు.

అనుమతులు లేకుండా పలుచోట్ల ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా 300కు పైగా లేడీస్‌ హాస్టల్స్‌ కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా గుంటూరు అర్బన్‌ పోలీస్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి. లేడీస్‌ హాస్టల్‌ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదరు అధికారులు హాస్టల్‌ ఏర్పాటు చేసే భవనాలను పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించి ఆయన ఆదేశాల మేరకు అనుమతివ్వాలి. లేడీస్‌ హాస్టళ్లు కావడంతో అనుమతి ఇచ్చే సమయంలో బిల్డింగ్‌ చుట్టూ ప్రహరీ గోడ ఉందా.. సరైన రక్షణా చర్యలు చేపట్టారా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే, ప్రస్తుతం లేడీస్‌ హాస్టళ్ల నిర్వాహకులు అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆమ్యామ్యాలు స్వీకరించి మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

రక్షణ కరువు
పట్టణాలతోపాటు ఊరికి దూరంగా ఉన్న లేడీస్‌ హాస్టళ్లలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. అపార్టుమెంట్లలో కింద, పైన వ్యాపార సముదాయాలకు అద్దెకిచ్చి మధ్యలో లేడీస్‌ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని లేడీస్‌ హాస్టల్‌లో అయేషామీరా హత్య ఉదంతం, తెనాలి హాస్టల్‌లోకి సైకో ప్రవేశించి దారుణాలకు పాల్పడిన సంఘటనలతోపాటు బయటకు పొక్కని సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ నిర్వాహకులకు చీమకుట్టి నట్లైనా ఉండటం లేదు. అక్కడ విద్యార్థినులకు ఏం జరిగినా బయటకు పొక్కడానికి వీల్లేదు. అదేమంటే బయటకు తెలిస్తే ‘మీపరువే పోతుంది.. మీ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్తా’రంటూ విద్యార్థినులను భయపెడుతున్నారు. విద్యార్థినుల రక్షణ గురించి పర్యవేక్షించాల్సిన అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తూ చేతులు దులుపుకుంటున్న పోలీసులు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి వీటిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

నిబంధనలు బేఖాతర్‌
లేడీస్‌ హాస్టళ్లను మహిళలు మాత్రమే నిర్వహించాలి. కళాశాల విద్యార్థినులకు ఏర్పాటు చేసిన చోట్ల బయట మహిళలకు వసతి కల్పించకూడదు. విద్యార్థినుల్ని చేర్చుకునే సమయంలో కూడా వారు చదివే కళాశాల యాజమాన్యం లేఖ ఇవ్వాలి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఉద్యోగాల సాకుతో వచ్చే కొందరు ఆకతాయి మహిళలకు సైతం వసతి కల్పిస్తున్నారు. వీరు నిరుపేద విద్యార్థినులకు డబ్బు, బట్టలు, సెల్‌ఫోన్‌ వంటి వాటిని ఇచ్చి ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి హాస్టల్‌ నిర్వాహకులు సైతం సహకరిస్తూ రాత్రి వేళల్లో యువకులను హాస్టల్లోకి అనుమతిస్తూ విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రత్యేక దృష్టి సారిస్తాం
హాస్టల్స్‌ నిర్వహణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులను ఆప్రమత్తం చేస్తాం. ఇప్పటికే ఆయా హాస్టల్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం.
- సీహెచ్‌. విజయారావు, అర్బన్‌ ఎస్పీ

ఎంతటి వారైనా ఉపేక్షించం  
నిబంధనలకు విరుద్ధంగా లేడీస్‌ హాస్టల్స్‌ను నిర్వహిస్తే సహించేది లేదు. ఇప్పటికే శక్తి బృందాలు వారి పరిధిలో కొనసాగుతున్న హాస్టల్స్‌కు వెళ్లి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా నిర్భయంగా తెలియచేయవచ్చు. వ్యభిచారాన్ని ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోం.        
– ఎస్‌.వి. రాజశేఖరబాబు, రూరల్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు