లేడీ రౌడీషీటర్‌ ఆగడాలు.. మహిళను ఎత్తుకెళ్లి..

11 Feb, 2019 10:47 IST|Sakshi
రౌడీషీటర్‌ యశస్విని, బాధితురాలు లలిత

బెంగళూరు : కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉన్న లేడీ రౌడీషీటర్‌ యశస్విని అమాయకులపై దౌర్జన్యాలను తిరిగి ప్రారంభించింది. ఆరు నెలల క్రితం చెన్నమ్మన కెరె అచ్చుకట్టు ప్రాంతంలో గ్యాంగు ఏర్పాటు చేసుకొని రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో సీకే అచ్చుకట్టు పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. దీంతో కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న యశస్విని ఉత్తర విభాగానికి మకాం మార్చింది. అయితే పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉత్తర విభాగంలోని పలు ప్రాంతాల్లో రౌడీయిజం చేస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బాగలకుంటె ప్రాంతానికి చెందిన లలిత అనే ఓ మహిళ యశస్వినిపై గంగమ్మనగుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో తుదివిచారణ జరుగనున్న నేపథ్యంలో లలితను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరో ఎనిమిది మంది మహిళా రౌడీలతో కలసి గురువారం ఇంటికి వెళుతున్న లలితను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రగాయాల పాలైన లలితను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లలిత ఫిర్యాదుతో యశస్వినిపై కేసు నమోదు చేసుకున్న గంగమ్మనగుడి పోలీసులు యశస్విని కోసం గాలిస్తున్నారు. యశస్వినిపై గంగమ్మనగుడితో పాటు బాగలకుంటె, ఆర్‌ఎంసీ యార్డు పోలీస్‌స్టేషన్‌లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈమె ఆగడాలు శ్రుతి మించడంతో గూండాచట్టం అమలుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు