నమ్మకంగా వచ్చి..బంధువు ఇంట్లోనే చోరీ

18 Apr, 2018 13:32 IST|Sakshi
నిందితురాలి వివరాలు వెల్లడిస్తున్న సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు 

ఒంగోలు క్రైం: దూరపు బంధువని ఇంటికి రానిస్తే..ఆ ఇంటికే కన్నం వేసిన సంఘటన ఒంగోలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందిన షేక్‌ గాలీబ్‌బీ ఈ నెల 4వ తేదీన ఒంగోలు నగరంలోని మరాఠిపాలెంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది.

బంధువులైన పఠాన్‌ మస్తాన్‌ దూరపు బంధువని ఇంట్లో ఉంచి మర్యాదలు చేశారు. అయితే తన దొంగ బుద్ధి పోనిచ్చుకోని గాలీబ్‌బీ బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తాళాలు అపహరించి బీరువా లాకర్‌లోని సుమారు 14 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించింది. ఆమె ఇంటి నుంచి వెళ్లిన తరువాత   చూసుకుంటే బీరువాలోని ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పఠాన్‌ మస్తాన్‌ ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై బి.శ్రీకాంత్‌ సిబ్బందితో దర్యాప్తు చేశారు.

దీంతో గాలీబ్‌బీపై అనుమానంతో మంగళవారం ఉదయం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఆమెను గుర్తించి పట్టుకుని విచారించడంతో బంగారు ఆభరణాల గుట్టు వెల్లడించిందన్నారు. దీంతో ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా మహిళా దొంగను పట్టుకున్నందుకు సిబ్బందిని ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు