పోలీసులకు చిక్కిన మాయ లేడి   

20 Apr, 2018 09:05 IST|Sakshi
విలేకరుల సమావేశంలో నిందితురాలిని చూపుతూ, మాట్లాడుతున్న ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు

భక్తులు, ప్రయాణికులే టార్గెట్‌గా చోరీలు

రూ.5లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం

ద్వారకాతిరుమల :  భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్షేత్ర పరిసరాల్లోనూ, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులను ఎంతో చాకచక్యంగా తెరచి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మాయలేడిని అరెస్ట్‌ చేసినట్లు ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన 19 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో డీఎస్పీ గురువారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన జలతా లక్ష్మి  ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తుల బంగారు వస్తువులను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చేబ్రోలు మండలం కైకరం గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తూ ఆమె పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. వీటికి  సంబంధించి ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో మూడు, చేబ్రోలు పోలీస్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు.

లక్ష్మిని పాత నేరస్తురాలిగా గుర్తించామని పేర్కొన్నారు. ఆమెను గురువారం ఉదయం స్థానిక కుంకుళ్లమ్మను ఆలయం వద్ద భీమడోలు సీఐ బిఎన్‌.నాయక్‌ అరెస్ట్‌ చేసినట్టు వివరించారు.  ఈ కేసులను ఛేదించిన సీఐ నాయక్‌ను, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దర్యాప్తుకు సహకరించిన ఐడీ పార్టీ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్‌ వసంతరావు, నాగేశ్వరరావు, రామచంద్రరావు, మురళీ తదితరులను ఆయన అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. 

భక్తులు అప్రమత్తంగా ఉండాలి 

ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్సీ ఈశ్వరరావు అన్నారు. ఆలయ పరిసరాల్లో మరికొన్ని సీసీ కెమేరాల ఏర్పాటుకు ఆలయ అధికారులతో చర్చించామన్నారు. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే దొంగతనాల నియంత్రణకు సంబంధించి భక్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని వివరించారు. 

మరిన్ని వార్తలు