బంగారు కడ్డీ ఆశ చూపి మోసం

21 Jun, 2018 09:46 IST|Sakshi
ఆమనగల్లు పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు మహిళా దొంగలు 

వృద్ధురాలి నుంచి ఆభరణాలు దోచేసిన ముగ్గురు కిలేడీలు

ఆమనగల్లు: ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటమ్మ అనే వృద్ధురాలిని మభ్యపెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిన ముగ్గురు కిలేడీలను ఆమనగల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఫతేనగర్‌కు చెందిన వేముల సమ్మక్క అలియాస్‌ లక్ష్మి, రాజేంద్రనగర్‌కు చెందిన చల్లా నర్సమ్మ, ఫతేనగర్‌కు చెందిన బండారి అనితలు ముఠాగా ఏర్పడి ముఖ్య కూడలిలో వృద్ధులను గుర్తించి వారిని మభ్యపెట్టి ఆభరణాలు దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈనెల 10న ఆమనగల్లు పట్టణంలో మంగళపల్లికి చెందిన వరికుప్పల వెంకటమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు పూత పూసిన ఇనుపకడ్డీని ఆమె ముందు వేసి... పెద్దమ్మ ఇది నీదా.. అంటూ ఒక మహిళ వృద్ధురాలితో మాటలు కలిపింది.

వెనుక నుంచి వచ్చిన అదే ముఠాకు చెందిన మరో ఇద్దరు మహిళలు వారితో జత కలిశారు. బంగారు కడ్డీని నలుగురం ముక్కలు చేసి పంచుకుందామని భాగానికి వచ్చారు. అయితే రేపు నువ్వు వస్తావో రావో.. నిన్ను నమ్మడమెలా అని వృద్ధురాలిని కంగారు పెట్టించారు. కడ్డీని నీ దగ్గరే ఉంచుకోమని చెప్పి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యారు.

ఇంటికొచ్చిన వరికుప్పల వెంకటమ్మ తనకిచ్చిన కడ్డీ నకిలీదని తెలుసుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధురాలిని మోసం చేసిన ముగ్గురు మహిళలు వేముల సమ్మక్క, చల్లా నర్సమ్మ, బండారు అనితలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని కల్వకుర్తి కోర్టులో హాజరు పరిచారు. విలేకరుల సమావేశంలో ఎస్సై మల్లీశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు