మౌనికకు న్యాయం జరిగేనా?

25 Mar, 2018 09:00 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన మౌనిక, మద్దతుగా స్థానిక సర్పంచ్, మహిళలు

పెళ్లి చేసుకుంటానని యువకుడి మోసం

అధికారులను కలిసినా దక్కని ఫలితం..

న్యాయం చేయాలని వేడుకోలు

దండేపల్లి(మంచిర్యాల) : పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు, ఏడాది కాలంగా ప్రేమించి గర్భవతిని చేశాడు. ఇక పెళ్లి విషయం అడిగితే పెళ్లి లేదు ఏమీ లేదంటూ, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ, యువతి గత కొద్ది రోజుల క్రితం ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆ తర్వాత ఆమె పోలీసు, రెవెన్యూ, ఐకేపీ అధికారులను కలిసింది. అయినా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఆమె మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. మండలంలోని గుడిరేవుకు చెందిన జంగిల్‌ శ్రావణ్‌ ఇదే గ్రామానికి మౌనిక అనే యువతిపై కన్నేశాడు. కొద్ది రోజులు ఆమె వెంటపడ్డాడు. ఏంటీ నావెంట పడుతున్నావని ఆమె అడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె అతడి మాటలు నమ్మింది. ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతి అప్పుడప్పుడు శ్రావణ్‌ వాళ్ల ఇంటికి కూడా వచ్చి ఇంటి పనులు చేసేది.

దీంతో వీరిద్దరి ప్రేమ విషయం అతడి తల్లికి కూడా తెలిసింది. ఇంతలో యువతి గర్భం దాల్చింది. విషయం అతడికి చెప్పడంతో గర్భం తీయించుకోవాలని శ్రావణ్‌ ఆమెను ఒత్తిడి చేసి చేయి చేసుకున్నాడు. ఇలా జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆమె వద్దకు రాకుండా తప్పించుకు తిరిగాడు. ఓ రోజు గ్రామ సమీపంలో అడ్డుకుని నా పరిస్థితి ఏంటని ఆమె నిలదీసింది. పెళ్లి చేసుకోనని శ్రావణ్‌ చెప్పడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించింది. గత నెల 17న ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బా పట్టుకుని తల్లిదండ్రుతో కలిసి బైఠాయించింది. స్థానికుల సలహాతో పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తహసీల్దార్, ఐకేపీ ఏపీఎంతో పాటు మహిళా సంఘాలను కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పోలీసులు కూడా యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్‌ చేశారు. అయినా అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆతర్వాత అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.  శనివారం మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె బైఠాయించడం చూసిన ప్రియుడి తల్లి ఇంటికి తాళం వేసి వెళ్లి పోయింది. యువతికి స్థానిక సర్పంచ్‌ మంజుభార్గవి, గ్రామానికి చెందిన పలువురు మహిళలు మద్దతుగా నిలిచారు.

మరిన్ని వార్తలు