వీరికి మోహం... వారికి దాహం

5 Oct, 2019 11:01 IST|Sakshi

తమిళనాడు ప్రజల్లో బంగారు నగల క్రేజు

ఉత్తరాది దొంగలకు ఇదే రివాజు

దోపిడీలపై రిటైర్డు పోలీసు అధికారి విశ్లేషణ

పట్టుబడిన ‘లలిత’ చోరులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగారమంటే తమిళనాడు ప్రజల్లోన తరగని వ్యామోహమే ఉత్తరాది దొంగల దోపిడీ దాహాన్ని తీరుస్తోందని రిటైర్డు పోలీసు అధికారి ఒకరు చెబుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన దోపిడీ దొంగలు తమిళనాడునే ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

బ్రిటీష్‌ తెల్లదొరలు భారత్‌ను బానిస దేశంగా పరిగణించింది ఇక్కడున్న అత్యంత విలువైన వనరులను ఇంగ్లాండు దేశానికి కొల్లగొట్టుకుపోవడానికే. అలాగే ఉత్తరాది దొంగలు సైతం దక్షిణాది సంపదను కొల్లగొట్టి తమ రాష్ట్రాలకు తరలించేందుకు తమిళనాడును ఎన్నుకున్నారు. ఈ తరలింపులో బంగారం ప్రధానపాత్ర పోషిస్తోంది. మొత్తం భారతదేశంలోనే పెద్ద ఎత్తున బంగారు అభరణాల అమ్మకాలు సాగేది తమిళనాడులోనే. ఆర్థికంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పెళ్లి తదితర శుభ కార్యాలకే కాదు, అన్నిరకాల సమావేశాలకు సైతం పెద్ద ఎత్తున బంగారు నగలను అలంకరించుకుని రావడం రాష్ట్ర మహిళలకు అలవాటు.  అందుకే చెన్నై మహానగరంలో చైన్‌ స్నాచింగ్‌లు చోటుచేసుకోని రోజు ఉండదు.

మహిళల మధ్య పోటీలా బహిరంగంగా సాగుతున్న బంగారు నగల ప్రదర్శన ఇతరుల మాటెలా ఉన్నా ఉత్తరాది దొంగలను మాత్రం ఎంతో ఆకర్షిస్తోంది. అంతేగాక బంగారు నగలను సేకరించడం కూడా తమిళనాడు మహిళలకు వంశపారంపర్యంగా హాబీగా వస్తోంది.  సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు, అధికారులు కిలోల లెక్కన బంగారును కొనుగోలు చేసి లాకర్లలో దాస్తుంటారు. పేదలు సైతం యథాశక్తి బంగారు కొనుగోలు చేస్తారు. అదేమని అడిగితే కష్టకాలంలోకుదువపెట్టుకునేందుకు ఉపయోగపడుతుందని కొంటున్నామని బదులిస్తారు. పెళ్లి సమయంలో వరదక్షిణగా కిలోల లెక్కన బంగారు నగలు చెల్లిస్తుంటారు. వరదక్షిణ ఇవ్వడం, పుచ్చుకోవడం చట్టరీత్యా నేరమైనా యథేచ్చగా సాగిపోతోంది. బంగారు ధర ఎంతగా పెరిగినా జ్యువెలరీ షాపుల్లో రద్దీకి మాత్రం కొదవ ఉండదు. దాదాపుగా ప్రతిరోజూ కిటకిటలాడి పోతుంటాయి. ఇలా అనేక కోణాల్లో బంగారు నగలకు తమిళనాడు ప్రసిద్ధికావడంతో ఉత్తరాది దొంగలముఠాకు రాష్ట్రం తరగని బంగారు గనిగా మారింది.

దోపిడీ దొంగలను మాత్రమే కాదు, ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం తమిళనాడు ఆకర్షించింది. దేశం మొత్తంపై ఐటీ పరంగా తమిళనాడులో చోటుచేసుకున్న ఆకస్మిక తనిఖీలు, మెరుపు దాడులు మరెక్కడా జరగవు. ఐటీ దాడుల్లో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయనాయకులు ఎందరో పట్టుబడ్డారు.. పట్టుబడుతున్నారు. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సంపదలో అధికశాతం బంగారు ఉండడం గమనార్హం. తమిళనాడు ప్రజలకు బంగారు నగలపై తీరని మోహం ఉత్తరాది దొంగల దాహాన్ని తీరుస్తోందని ఆ రిటైర్డు పోలీసు అధికారి చెప్పారు. తమిళనాడు ప్రజల మోహం, ఉత్తరాది దొంగల దాహం ఎప్పుడు తీరుతుందో కాలమే నిర్ణయించాలని ఆయన వ్యాఖ్యానించారు.

స్వాధీనం చేసుకున్న నగలు, మణికంఠన్, మురుగన్, సురేష్‌
‘లలిత’ చోరుడు దొరికాడు: తిరుచ్చిరాపల్లిలోని లలితా జ్యువెలరీలో రూ.13 కోట్ల విలువైన బంగారు నగల దోపిడీకి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. తిరువారూరులో వాహనతనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒకడు పట్టుబడగా, మరొకడు పారిపోయాడు. తిరుచ్చిరాపల్లి బస్‌స్టేషన్‌ సమీపంలోని లలితా జ్యువెలరీలో రెండురోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి పాఠకులకు విదితమే. జ్యువెలరీలో మొత్తం 190 మంది పనిచేస్తుండగా వీరిలో పది మంది ఉత్తరాదికి చెందిన వారు కావడంతో ఆ కోణంలో తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. పుదుక్కోట్టైలోని ఒక లాడ్జీలో ఉన్న ఐదుగురు ఉత్తరాది యువకులను పోలీసులు విచారించగా వారంతా వివిధ దోపిడీ కేసుల్లోని దొంగల ముఠాకు చెందిన సభ్యులని తేలింది. ఇదిలా ఉండగా, తిరువారూరు జిల్లావ్యాప్తంగా తీవ్రస్థాయిలో వాహనతనిఖీలు జరుగుతుండగా గురువారం రాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు నిలపగా, బైక్‌ను అక్కడే పడేసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వీరిలో తిరువారూరు జిల్లా మాడపురానికి చెందిన మణికంఠన్‌ (32) పట్టుబడగా అదే జిల్లాకు చెందిన సురేష్‌ (28) అనే మరో యువకుడు పారిపోయాడు. విచారణలో లలిత జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన వారిలో మణికంఠన్‌ ప్రధాన నిందితుడని తేలింది. ముఠా నాయకుడు తిరువారూరుకు చెందిన మురుగన్‌ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దుండగులు వచ్చిన బైక్‌ నుంచి లలిత జ్యువెలరీకి చెందిన కొన్ని బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికంఠన్‌ ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

పట్టిచ్చిన మిరప్పొడి: లలిత జ్యువెలరీలో ఉత్తరాది దొంగలే దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. దుండగులు పనిముగించుకుని వెళ్లే ముందు పోలీసు జాగిలాన్ని తప్పుదోవ పట్టించేందుకు ముఠానాయకుడు మురుగన్‌ సలహాతో మిరప్పొడి చల్లారు. అయితే ఉత్తరాది దొంగలకు మిరప్పొడి వినియోగించే అలవాటు లేదని పోలీసుల విచారణలో తేలడంతో తమిళనాడువారి పనే అయి ఉంటుందనే కోణంలో విచారణ దిశను మార్చుకున్నారు. దీంతో దొంగలెవరో గుర్తించడం సాధ్యమైంది. 

మరిన్ని వార్తలు