విషాదం నింపిన భూవివాదం

10 Dec, 2017 02:04 IST|Sakshi
ట్రాక్టర్‌ రొటోవేటర్‌లో చిక్కుకొని మృతి చెందిన విమల

     చిత్తూరు జిల్లాలో ట్రాక్టర్‌తో ఢీకొట్టి మహిళ హత్య 

     మహిళా రైతు విమల అంత్యక్రియలు

     పోలీసుల అదుపులో నిందితులు 

చిత్తూరు, సాక్షి: మహిళా రైతు విమల(52)ను శుక్రవారం కర్కశంగా చంపిన ఘటనతో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలోని వరిగపల్లెలో విషాదం అలుముకుంది. భూ తగాదాల నేపథ్యంలో రంజిత్‌ అనే వ్యక్తి శుక్రవారం అత్యంత కిరాతకంగా ట్రాక్టర్‌ రొటోవేటర్‌తో విమలను తొక్కించి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతేగాక అడ్డువచ్చిన ఆమె భర్తను సైతం ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రశాంతంగా ఉండే ఊళ్లో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామమంతా ఉలిక్కిపడింది. గ్రామంలో అందరికీ తల్లో నాలుకగా వ్యవహరించే మనిషి దూరమవడంతో ఊళ్లోని చిన్నాపెద్దా కన్నీరు పెట్టారు. విమల అంత్యక్రియలు వరిగపల్లెలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగాయి. మృతదేహాన్ని చూసి కూతురు భవ్యశ్రీ గుండెలవిసేలా ఏడ్వడం అందర్నీ కదిలించింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, నిందితులు రంజిత్, గోవిందరాజు, రంజిత్‌ తండ్రి గోవిందయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అసలేం జరిగింది?  
విమల(52), జగన్నాథరెడ్డి(59) భార్యాభర్తలు. జగన్నాథరెడ్డికి శ్రీరాములురెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు. శ్రీరాములురెడ్డికి వరిగపల్లె చెరువు సమీపంలో 14 గుంటల వ్యవసాయ పొలం ఉంది. ఈ పొలాన్ని ఐదు సంవత్సరాల క్రితం చిత్తూరుకు చెందిన ఏకాంబరమేస్త్రీ అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టి కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న సంవత్సరం తరువాత శ్రీరాములురెడ్డి చనిపోయాడు. దీంతో ఏకాంబరమేస్త్రీ డబ్బు విషయం జగన్నాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చాడు. ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పడంతో ఏకాంబర మేస్త్రీ వరిగపల్లి గ్రామానికే చెందిన రంజిత్‌ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం విక్రయించాడు. ఎంత ఒత్తిడి చేసినా ఏకాంబర మేస్త్రీకి రంజిత్‌ డబ్బు చెల్లించలేదు. దీంతో ఏకాంబర మేస్త్రీ జగన్నాథరెడ్డితో కలిసి చిత్తూరు సివిల్‌ కోర్టులో కేసు వేశాడు.  

ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ రావడంతో...
శ్రీరాములురెడ్డి, జగన్నాథరెడ్డి అన్నదమ్ములు కాబట్టి భూమి జగన్నాథరెడ్డికి చెందుతుందని ఈ నెల 8న కోర్టు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో ట్రాక్టర్‌తో పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లారు జగన్నాథరెడ్డి దంపతులు. పొలంలో పనులు చేస్తుండగా రంజిత్‌ స్నేహితుడు గోవిందరాజులు చూసి పనులు అడ్డుకున్నాడు. రంజిత్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న రంజిత్‌ పొలం మాది.. పనులు ఎలా చేస్తారని ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగింది. పట్టారాని కోపంతో రంజిత్‌ వివాదాస్పద పొలం పక్కనే ఉన్న జగన్నాథరెడ్డి జొన్న పంటను ట్రాక్టర్‌తో తొక్కించేశాడు. పంటను నాశనం చేయొద్దని పొలం గట్టుపై నుంచి విమల అరవడం మొదలు పెట్టింది. దీంతో రంజిత్‌ విచక్షణ మరచి.. ఆమెను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆమె రొటోవేటర్‌లో ఇరుక్కొని దుర్మరణం చెందింది.

మరిన్ని వార్తలు