భూవివాదం.. ఘర్షణ

24 Sep, 2018 07:32 IST|Sakshi
చెయ్యిపై తీవ్ర గాయమైన శ్రీనివాసరెడ్డి, చికిత్స పొందుతున్న బండి వెంకటరెడ్డి

సత్తుపల్లి/వేంసూరు: భూవివాదం చినికి చినికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేంసూరు మండలం కల్లూరుగూడెం లో ఆదివారం సాయంత్రం ఇది జరిగింది. బాధితుడు బండి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని తండ్రి బండి వెంకటరెడ్డి కొనుగోలు చేశాడు. ఈ భూమి తనదేనంటూ మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు ఆక్రమించాడు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ పొలం వద్దకు  కల్లూరు ఆర్డీఓ టీఏవీ నాగలక్ష్మి వచ్చి విచారణ చేపట్టారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు ఎవ్వరూ ఆ భూమిలోకి వెళ్లవద్దని ఆదేశించారు. దీనిని మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు ఉల్లంఘించాడు. ఆయన ఆదివారం ఆ పొలం దున్నుతుండగా బండి శ్రీనివాసరెడ్డి, బండి వెంకటరెడ్డి అడ్డుకోబోయారు. దీంతో, వారిపై రాచూరి గంగరాజు, ఆయన కుమారుడు వంశీ, జంగా నరేష్, వీరవెంకి వెంకటేశ్వరరావు కలిసి కొడవళ్లతో దాడి చేశారు. బండి వెంకటరెడ్డికి తలపై, శ్రీనివాసరెడ్డికి చేయిపై తీవ్ర గాయాలయ్యాయి.  వారిని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రాజకీయ రంగు...! 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు వెల్ధి జగన్మోహన్‌రావు కలిసి పొలం పరిశీలించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగిందని బండి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దాడి వార్తతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు పెద్ద సంఖ్యలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. కల్లూరుగూడెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. క్షతగాత్రులను జిల్లా దిశ కమిటీ సభ్యుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ పరామర్శించారు. కేసును సత్తుపల్లి రూరల్‌ సీఐ మడత రమేష్‌గౌడ్‌ పర్యవేక్షణలో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు