భగ్గుమన్న పాతకక్షలు

24 Nov, 2018 10:28 IST|Sakshi
ఆంగోతు హేమ్లా మృతదేహం

మోతె (కోదాడ) : నివురు గప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు భగ్గుమన్నాయి. బోరుబావి విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ తగాదాలు తండ్రి ప్రాణాలను బలిగొనగా తనయుడిని ఆస్పత్రి పాల్జేశాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాం పురం తండాకు చెందిన ఆంగోతు సైదులు, ఆంగోతు హేమ్లా (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తండా శివారులోనే పక్కపక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి.

ఏడాదిగా తగాదాలు
ఆంగోతు సైదులు తన వ్యవసాయ భూమిలో ఏడాది క్రితం బోరు వేసుకున్నాడు. నీరు పుష్కలంగా ఉండడంతో అతడి భూమి పక్కనే వ్యవసాయ భూమి కలిగిన హేమ్లా కూడా ఆ బోరుకు సమీపంలోనే మరో బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటినుంచే రెండు కుటుంబాల మధ్య తగాదాలు సాగుతున్నాయి.

అర్ధరాత్రి బోరు వేయాలని..
ఎలాగైనా సైదులు బోరుకు సమీపంలోనే మరో బోరు వేయాలని హేమ్లా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం కొబ్బరికాయతో బోరు వేసే పాయింట్‌ను గుర్తించారు. అది గమనించిన సైదులు అతడి కుమారులు రాములు, సురేష్‌ దానిని అడ్డుకునేందుకు అప్రమత్తమయ్యారు. అయితే హేమ్లా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తన కుమారుడు ఉపేందర్‌తో కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు.

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
అప్పటికే వ్యవసాయ భూమి వద్ద సైదులు అతడి కుమారులు మాటువేసి ఉన్నారు. బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్న హేమ్లా అతడి కుమారుడు ఉపేందర్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే సైదులు అతడి కుమారులు కలిసి రాడ్‌తో హేమ్లా తలపై బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో అడ్డువచ్చిన ఉపేందర్‌కు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి ఉపేందర్‌ను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
రాంపురంతండాలో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్‌ఐ సంతోష్‌ ఇతర సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వివాదానికి కారణమైన వ్యవసాయ భూములను పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హేమ్లా కుమారుడు రమేష్‌ కుమారుడి ఫిర్యాదు మేరకు ఆంగోతు సైదులు, అతడి కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు