రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

5 Sep, 2019 06:53 IST|Sakshi

సాక్షి, కడప : రూ.10 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు ఎగ్గొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు.. కడప నగరం హబీబుల్లా వీధిలో నివాసముంటున్న జేకే రాజేష్‌సింగ్, అతని అన్న రమేష్‌సింగ్‌లకు కడప సమీపంలోని విశ్వనాథపురంలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వారు ప్రొద్దుటూరులోని బి.కొత్తపల్లె, వీఆర్‌ కాలనీకి చెందిన మణిప్రసాద్‌రెడ్డి భార్య కవితకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబర్‌ 24న రూ.2కోట్ల 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని అగ్రిమెంట్‌ రాయించారు.

ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 28న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు కడప బాలాజీనగర్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు వారిని పిలిపించారు. అయితే వారు పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకురాకపోవడంతో ఈనెల 3వ తేదీకి రిజిస్ట్రేషన్‌ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజేష్‌ సింగ్, రమేష్‌ సింగ్‌లు 3వ తేదీ మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొద్దుటూరుకు చెందిన కవిత, మణిప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, మురళి ఉన్నారు. వారంతా కలిసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు తక్కువ ఇచ్చారు.

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత డబ్బులు తక్కువ ఇస్తే ఎలా అని బాధితులు ప్రశ్నించగా ‘ మీకు డబ్బులు ఇచ్చేది లేదు.. మా జోలికి వస్తే చంపుతాం’ అంటూ బెదిరించి దాడికి పాల్పడ్డారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.     

మరిన్ని వార్తలు