భూవివాదంలో రౌడీషీటర్ల రంగప్రవేశం

25 Sep, 2018 13:30 IST|Sakshi
కూల్చిన ఫెన్సింగ్‌ను చూపిస్తున్న బాధిత భూయజమానులు, రౌడీలు వదిలి వెళ్లిన వేట కొడవళ్లు  

కందుకూరు (రంగారెడ్డి): రియల్‌ ఎస్టేట్‌ ప్రభావంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో వివాదాలు అంతే వేగంగా ప్రారంభమయ్యాయి. కందుకూరు మండలంలో దెబ్బడగూడ గేట్‌ సమీపంలోని సర్వే నంబర్‌ 460లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను అర్ధరాత్రి కొందరు దుండగులు కాపలాదారులపై దాడిచేసి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సర్వే నంబర్‌ 460లో హైదరాబాద్‌ చంద్రాయణగుట్టకు చెందిన మొహినుద్దీన్, మోహిన్‌మర్ఫిది, ఎండీ హిదాయతుల్లాలకు 5.35 ఎకరాల భూమి ఉంది. అదే నంబర్‌లో ఎస్‌.సుగుణాకర్‌రెడ్డి, చండీశ్వర్‌కు చెందిన మరో ఎకరం భూమి ఉంది. ఈ భూముల చుట్టూ యజమానులు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు.

కాగా, అదే సర్వే నంబర్‌లో వారి భూమికి ఆనుకునే హైదరాబాద్‌కు చెందిన అస్లాంకు కొంత భూమి ఉంది. వీరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదివారం అర్ధరాత్రి డీసీఎం వాహనం, కార్లలో పెద్దఎత్తున పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భూమి యజమాని అస్లాం రౌడీలతో తరలివచ్చి పొలంలో పని చేస్తున్న కాపలాదారుల్ని కత్తులతో బెదిరించి ఫెన్సింగ్‌ను కూల్చివేయించారు. దీంతో హడలిపోయిన వారు పోలీసులతో పాటు సంబంధిత యజమానులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీలు పరారయ్యారు. ఫెన్సింగ్‌ కూల్చివేతకు పాల్పడిన అస్లాంతో పాటు పలువురిపై సీఐ భాస్కర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అస్లాం తమను తరచూ భూవిషయమై బెదిరిస్తున్నాడని బాధిత భూ యజమానులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు