విద్యార్థుల గదుల్లో చొరబడి...!

18 Jul, 2020 07:15 IST|Sakshi

ల్యాప్‌టాప్‌ల చోరీ పాతనేరస్తుడి అరెస్టు

రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

నాగోలు: ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ  కార్యాలయంలో డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్‌ మండలం, చెల్‌పురం గ్రామానికి చెందిన  కె. రవికిరణ్‌ ఆలియస్‌ నల్వాలా రవికిరణ్‌ (34) ఎలక్ట్రీషియన్‌. ఇతను గతంలో సూర్యాపేట జిల్లా సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్, హనుమకొండ, కోదాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు ఇళ్లల్లో  దొంగతనాలు చేయగా పోలీస్‌లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తుర్కయాంజల్, సూరజ్‌నగర్‌ కాలనీలో అద్దెకు  ఉంటూ ల్యాప్‌టాప్‌లు రిపేర్‌ చేస్తానంటూ కాలనీలో అందరినీ నమ్మబలికాడు.

ఉదయం  కాలనీలో తిరుగుతూ విద్యార్థులు ఉండే గదులను ఎంపిక చేసుకొనేవాడు. వారు కాలేజీలకు వెళ్లిన తర్వాత గదుల్లో చొరబడి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు ఎత్తుకెళ్లేవాడు. దొంగతనం చేసిన ల్యాప్‌టాప్‌లను సికింద్రాబాద్, వరంగల్, ఇతర ప్రాంతంలో అమ్మేవాడు. ఇతను రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మీర్‌పేట, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్, పహాడీషరీఫ్, సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ల్యాప్‌టాప్‌లు చోరీలకు పాల్పడ్డాడు. ల్యాప్‌టాప్‌ల చోరీపై  నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీస్‌లు రవి కిరణ్‌పై ప్రత్యేక నిఘా పెట్టి శుక్రవారం అరెస్టు చేశారు.  అతడి వద్ద నుంచి  రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపాడు.  సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ ఎస్‌. జయరామ్, మీర్‌పేట సీఐ యాదయ్య, డీఐ సత్యనారాయణ, వనస్థలిపురం డీఐ జగనాథ్, ఎస్‌ఐలు నర్సింహతో సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు