ఆ షూటర్‌ లక్ష డాలర్లు ఎవరికి పంపాడు.. గర్ల్‌ఫ్రెండ్‌కా?

4 Oct, 2017 13:33 IST|Sakshi

లాస్‌ వెగాస్‌ : లాస్‌ వెగాస్‌లో అనూహ్య దాడితో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ కేసు అంతు తేల్చేందుకు అధికారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్పులు జరిపిన ఉన్మాది స్టీఫెన్‌ పెడాక్‌ (64) ఎందుకు ఆ విధంగా చేసి ఉంటాడనే గుట్టు తెలుసుకునేందుకు పోలీసుల మధ్య ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాజాగా అతడు కాల్పులు జరపడానికి ముందు రోజుల్లో దాదాపు లక్ష డాలర్లను పిలిప్పీన్స్‌కు బదిలీ చేశాడని గుర్తించారు. ప్రస్తుతం అక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే ఉంటుంది. అయితే, ఆ డబ్బు ఆమెకే పంపించాడా లేక మరింకెవరికైనా పంపించాడా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, సంపన్నుడైన పెడాక్‌ రోజుకు కనీసం పది వేల డాలర్లను జూదంలో వెచ్చించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇలాఎలా సాధ్యం అయిందనే దిశగా కూడా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం పిలిప్పీన్స్‌లో ఉంటున్న అతడి గర్ల్‌ఫ్రెండ్‌ మారిలౌ డాన్లీ (62)ని పోలీసులు తీరిగి బుధవారం అమెరికాకు రప్పించాలనుకుంటున్నారు.

ఆమెను ప్రశ్నించడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పక్కా ప్లాన్‌ ప్రకరమే అతడు ఈ దారుణకాండకు తెగించాడని తెలుస్తోంది. అతడు అద్దెకు తీసుకున్న హోటల్‌లోని 32అంతస్తులో ప్రత్యేకంగా బయటా లోపల సెక్యూరిటీ కెమెరాలు కూడా అమర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం ఎవరైనా వస్తే వారిని గుర్తించేందుకు పోలీసులైతే తప్పించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాడట. మరోపక్క, ఐసిస్‌ కూడా తామే ఈ దాడికి కారణం అని ప్రకటించగా అలా అయ్యే చాన్స్‌ లేదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. విచారణ పూర్తయితేగాని తాము క్లారిటీ ఇవ్వలేమంటున్నారు. ఉన్మాది గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ప్రశ్నించినప్పటికీ నేరుగా సమాధానాలు చెప్పేందుకు పోలీసులు ఆసక్తి చూపడం లేదు. ఉన్మాది నిజంగానే ముస్లిం మతంలోకి మారాడా? మారాకా ఐసిస్‌లో చేరాడా? తానే ఉన్మాదిలా మారి ఈ కాల్పులకు తెగబడ్డాడా? ఈ చర్యకు దిగే ముందు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఈ విషయం చెప్పాడా? ఈ విషయం అతడి గర్ల్‌ఫ్రెండ్‌కు ముందే తెలుసా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంది. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. కన్సర్ట్‌ వేదిక పక్కనున్న హోటల్‌లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు.

>
మరిన్ని వార్తలు