కొడుకు హత్య; అరెస్టైన చట్టసభ ప్రతినిధి భార్య

22 Oct, 2018 14:36 IST|Sakshi
అభిజీత్‌ యాదవ్‌(ఫైల్‌ ఫొటో)

లక్నో : కుమారుడిని హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రమేశ్‌ యాదవ్‌ భార్య మీరా యాదవ్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... రమేశ్‌ యాదవ్‌ రెండో భార్య మీరా యాదవ్‌ గతంలో రాష్ట్ర పర్యాటక శాఖలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం తన ఇద్దరు కుమారులు అభిషేక్‌, అభిజీత్‌లతో దారుల్‌షఫా ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అభిజీత్‌(23) శనివారం గుండెపోటుతో మరణించాడంటూ మీరా బంధువులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ప్రవర్తనతో అనుమానం కలిగిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది.

వాడు ఇక ఎప్పుడూ నిద్రలేవడు!
‘అభిజీత్‌ రాత్రి బాగా తాగి ఇంటికొచ్చాడు. అసలు వాడికి నిద్ర పట్టనే లేదు. అందుకే వాడి ఛాతీపై బామ్‌తో మర్ధనా చేశాను. నాకు తెలిసి వాడు ఇక ఎప్పుడూ నిద్ర లేవడు’ అంటూ మీరా యాదవ్‌ తమతో అన్నారని పొరుగింటి వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కొడుకును తానే గొంతు నులిమి హత్య చేశానని మీరా యాదవ్‌ అంగీకరించారు. తాగిన మైకంలో కన్న కొడుకే తనతో అసభ్యంగా ప్రవర్తించినందు వల్లే ఈ దారుణానికి ఒడిగట్టానని ఆమె చెప్పారని ఎస్పీ సర్వేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు