ఐసిస్‌ కలకలం

2 May, 2019 11:10 IST|Sakshi

చెన్నైలో ముగ్గురు శ్రీలంక వాసులు సహా నలుగురు అరెస్ట్‌

ఆగస్టు 15న మానవబాంబు అంటూ వైరల్‌గా మారిన న్యాయవాది వీడియో

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల కాలంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఐసిస్‌ తీవ్రవాదుల కదలికలతో కలకలంగా మారింది. శ్రీలంక బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండగా చెన్నైలో మంగళవారం అర్ధరాత్రి జరిపిన సోదాల్లో ముగ్గురు శ్రీలంక వాసులు సహా నలుగురు యువకులు పట్టుబడ్డారు.

శ్రీలంకలో గత నెల 21న చర్చిలో మానవబాంబు సృష్టించిన విధ్వంసం 253 మందిని బలితీసుకుంది. ఆ తరువాత మరికొన్ని బాంబు పేలుళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైతం ఇదేరకమైన ఘాతుకాలకు పాల్పడేందుకు ‘స్లీపర్‌ సెల్‌’ గా వ్యవహరిస్తున్న కొందరితో తీవ్రవాదులు సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమానిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మహిళలు సహా 21 మందితో కూడిన తీవ్రవాదులను గుర్తించగా వీరిలో 15 మంది అఫ్ఘనిస్తాన్, సిరియాకు తప్పించుకుని వెళ్లినట్లు కనుగొన్నారు. ఈ దశలో చెన్నై, కోయంబత్తూరు, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ తనిఖీలను నిర్వహిస్తోంది. అలాగే సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక బృందంగా ఏర్పడి చెన్నైలో తీవ్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఒక్క చెన్నైలోనే మంగళవారం ముగ్గురు శ్రీలంకవాసులు పట్టుబడ్డారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల సంఘటనలకు ముందు ఐసీస్‌ అగ్రనేత జాక్రాన్‌ హసీంతో మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీలంక పేలుళ్లతో వీరికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు రహస్యమార్గంలో, మరో ఇద్దరు విమానం ద్వారా చెన్నైకి వచ్చారు. ఇదిలా ఉండగా, పదిమందితో కూడిన ఎన్‌ఐఏ అధికారులు బుధవారం తంజావూరు, అదిరామపట్టినం, కుడందై పరిసర సముద్రతీర ప్రాంతాల్లో స్థానికపోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. రామనాధపురంలో 19 మంది తీవ్రవాదులు సంచరిస్తున్నట్లు సామాజిక మా«ధ్యమాలు అసత్యప్రచారం జరిగిందని నిర్దారించుకున్నారు. అయినా ఆయా ప్రాంతాలపై నిఘా, భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఓం ప్రకాష్‌ తెలిపారు.

చెన్నైలో నలుగురు శ్రీలంక యవకులు అరెస్‌ ్ట: శ్రీలంక పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు తమిళనాడు క్యూ బ్రాంచ్‌ పోలీసులు, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులకు అందిన సమాచారంతో మంగళవారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చెన్నై మన్నాడికి చెందిన ఒక యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో చెన్నై పూందమల్లి బెంగళూరు జాతీయ రహదారిలోని గోల్డన్‌ ఒబులన్స్‌ అనే అపార్టుమెంటులో కొందరు శ్రీలంక వాసులు నివసిస్తున్నట్లు కనుగొన్నారు. అర్ధరాత్రి వారు నివసిస్తున్న పోర్షన్‌ను చుట్టుముట్టి శ్రీలంకకు చెందిన తానూకా రోషన్, అతని అనుచరులైన మహమ్మద్‌ రబ్దూన్, లబేర్‌ మహమ్మద్‌ అనే యువకులను అరెస్ట్‌ చేశారు. శ్రీలంకలో ఒక హత్యకేసులో నిందితుడైన రోషన్‌ 8 నెలల క్రితం సముద్ర రహస్యమార్గంలో చెన్నైకి చేరుకున్నాడు. సుదర్శన్‌ అనే పేరు, కున్రత్తూరు, మెహతానగర్‌ చిరునామాతో ఆధార్‌కార్డు, గుర్తింపు కార్డులను పొంది ఉన్నాడు. అంతేగాక ఐసిస్‌ అగ్రనేత జాక్రాన్‌ హసీమన్‌కు సన్నిహితుడని తెలుసుకున్నారు. రోషన్‌ నివాసం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, పెన్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా చెన్నైలో నివసిస్తున్న నేరంపై పూందమల్లి పోలీసులు సైతం అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

ఆగస్టు్ట 15న చెన్నైలో మానవబాంబు దాడి: ఆగస్టు 15న రానున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సమయంలో చెన్నైలో మానవబాంబు దాడి చోటుచేసుకోనుందని సామాజిక మాధ్యమాల ద్వారా ఒక న్యాయవాది వీడియో అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. రామనాథపురం జిల్లాకు చెందిన స్వామి మదురైలో ఒక రూము తీసుకుని నివసిస్తూ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. గంజాయి ముఠాకు పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాక జిల్లా కోర్టు, కలెక్టర్‌ కార్యాలయ ప్రాంతాల్లో అర్ధనగ్నంగా పరుగులు పెట్టి కలకలం రేపారు. శ్రీలంక పేలుళ్లకు మదురై జిల్లా అధికారి ఒకరు కారణమని, అతని నడవడికలపై అనుమానం వ్యక్తం చేస్తూ 2016 ఏప్రిల్‌ లోనే ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. అంతేగాక, మరో మూడు నెలల్లో తమిళనాడులో తీవ్రవాదదాడులు చోటుచేసుకోనున్నాయి, నేను అబద్దం చెబుతున్నట్లు భావిస్తే అరెస్ట్‌ చేసి శిక్షించడంని ఆ విడియోలో సవాల్‌ విసిరాడు. ఆగష్టు 15వ తేదీన చెన్నైలో మానవబాంబు విధ్వంసాల కో ఐసం ‘అడ్‌ప్లాన్‌’ అనే పథకం రూపకల్పన జరిగి ఉందని, ఆ మానవబాంబులు ఉన్న ప్రాంతం తనకు తెలుసని చెప్పాడు. విద్యార్థులు, యువకుల ద్వారా రామనాథపురం, కీళ్‌కరైకి చెందిన ముగ్గురు యువతులతో ఈ దాడులు జరుగుతాయని తెలిపాడు. ఈ దాడుల పథకం గురించి నా వద్ద ఆధారాలున్నాయి, నేను కూడా వారితో కొన్నాళ్లు సంచరించి బైటకు వచ్చేశానని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌ మారడంతో మదురై పోలీసులు న్యాయవాది స్వామి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు