సత్వర దర్యాప్తు..ఉరిశిక్ష పడేలా చార్జిషీట్‌

19 Jul, 2018 05:10 IST|Sakshi

చెన్నైలో దివ్యాంగ బాలిక అత్యాచారం కేసుపై పోలీసుల పట్టుదల

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చెన్నై దివ్యాంగ బాలికపై రేప్‌ కేసులో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు పోలీసులు పట్టుదలగా ఉన్నారు. 3 నెలల్లోగా విచారణ ముగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. చెన్నైలోని అయనవరం ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన దివ్యాంగ బాలిక(11)పై ఏడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న 23 మందిలో 17 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయడం తెల్సిందే. ‘అయనవరం రేప్‌ కేసు ఒక్కటేకాదు లైంగిక నేరాల కేసులన్నీ త్వరగా∙విచారణ పూర్తి చేయాలి, కోర్టులు ఇలాంటి ఉదంతాలపై విచారణను వేగంగా ముగించి నిందితులను శిక్షించాలి’ అని మద్రాసు హైకోర్టు సీజే ఇందిరా బెనర్జీ బుధవారం  పోలీసులు ఆదేశించారు.

నిందితుల్లో 17 మంది నుంచి వాంగ్మూలం తీసుకుని రిమాండ్‌కు పంపారు. మిగతా వారి గాలింపు కోసం 50 మంది పోలీసులతో 5 బృందాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల  క్రితం చెన్నైకి చెందిన హాసిని అనే ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన దశ్వంత్‌ అనే యువ ఇంజనీరుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. ఈ తరహాలో అయనవరం నిందితులకు ఉరిశిక్ష పడేలా పగడ్బందీగా చార్జిషీటు వేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. నిందితులపై హత్యాయత్నం, ఫోక్సోచట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ సెక్షన్లపై కేసులు పెడితే ఉరిశిక్షకు అవకాశాలు ఎక్కువ.

>
మరిన్ని వార్తలు