దారుణానికి ఒడిగట్టింది ఓ లెక్చరర్‌..

26 Apr, 2018 09:11 IST|Sakshi
వివాహ సమయంలో సౌమ్య, రీమా, ఆసుపత్రిలో రీమా(కుడి)

కటక్‌, ఒడిశా : వివాహ బహుమతిలో బాంబు పెట్టి వరుడి ప్రాణాలను బలిగొన్న కేసులో ఒడిశా పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న బొలన్‌గిరిలో సౌమ్య శేఖర్‌ సాహూకి రీమా అనే యువతితో వివాహం జరిగింది. వరుడు శేఖర్‌ సాహూ తల్లి సంజుక్త స్థానిక జ్యోతి బికాశ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు.

కుమారుడి వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమెకు ప్రమోషన్‌ లభించడంతో ప్రిన్సిపాల్‌ అయ్యారు. దీన్ని ఓర్వలేని ఆమె సహోధ్యాపకుడు పున్‌జీలాల్‌ మెహర్‌ ఎలాగైనా సంజుక్త కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నారు. ఈ లోగా తనయుడి వివాహానికి సంజుక్త.. మెహర్‌ను కూడా ఆహ్వానించారు.

ఇదే అదునుగా తీసుకున్న మెహర్‌ వివాహం జరిగిన ఐదో రోజున నవ దంపతులకు బహుమతిని పంపారు. అందులో బాంబు ఉందని తెలీని శేఖర్‌ సాహూ తన నానమ్మతో కలసి తెరిచాడు. దీంతో బాంబు విస్ఫోటనం చెందడంతో ఇరువురు తీవ్రగాయాలపాలయ్యారు. వారికి చేరువలో ఉన్న వధువు రీమాకు కూడా గాయాలు అయ్యాయి.

గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుడు, అతడి నాయనమ్మ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వధువు శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు మెహర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతునట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు