చిరుత.. మృత్యువాత 

15 Jan, 2019 02:07 IST|Sakshi

వేటగాళ్ల ఉచ్చుకు బలి

మంచిర్యాలఅర్బన్‌: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిరుతపులి బలైంది. ఈ ఘటన సోమవారం మంచిర్యాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. మంచిర్యాల ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి వెంకటేశ్వరావు కథనం ప్రకారం... లక్సెట్టిపేట అటవీ రేంజ్‌ పరిధిలోని పాత మంచిర్యాల బీట్‌ రంగంపేట్‌ అటవీ సమీపంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఓ చెట్టుకొమ్మకు క్లచ్‌ వైరుతో ఉచ్చు బిగించారు. ఓ చిరుతపులి అటుగా వచ్చి ఈ ఉచ్చులో చిక్కుకుంది. తప్పించుకునే ప్రయత్నం చేసినా అది మెడకు మరింతగా బిగుసుకుపోవటంతో మృత్యువాత పడింది. సోమవారం అటవీ ప్రాంతంలోకి వంటచెరుకు కోసం వెళ్లిన స్థానికులు ఉచ్చులో పడి ఉన్న చిరుతను గమనించారు. సమాచారం అందుకు న్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. 3 రోజుల కిందట చిరుత మృతి చెందినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు.  

అనుమానాస్పదస్థితిలో చిరుత మృతి 
మాక్లూర్‌: నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ మేరకు నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న గుత్ప శివారులోని ఓ మామిడితోటకు వేసిన ఇనుప కంచె కు చిక్కిన చిరుత అదేరోజు సాయంత్రం తప్పించుకుంది. ఈ నేపథ్యంలో అటవీప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన చిరుత కళేబరం కనిపించింది. అటవీ అధికారులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు. చిరుతపులి చనిపోయిన స్థలంలో కొద్ది దూరంలోనే దాని తల, నడుము, మరి కొద్ది దూరంలో కాలు పడి ఉన్నాయి. చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయింది.

పక్కనే బీడీల కట్ట, అంబర్‌ ప్యాకెట్‌ లభించాయి. డాగ్‌స్క్వాడ్‌ ఆధారంగా గుత్ప తండాకు చెందిన రవికుమార్, తులసీరాం, నరేందర్, విజయ్‌లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి పులికి సంబంధించిన 7 గోర్లు, 4 దంతాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుత అనారోగ్యంతో మృతి చెందిందా.. లేదా వేటగాళ్లు చంపేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌కు పంపారు. 

మరిన్ని వార్తలు