సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు పేరుతో మోసం

24 May, 2018 13:46 IST|Sakshi
సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరైనట్లుగా వచ్చిన లెటర్‌లతో జూలకంటి రంగారెడ్డి, గిరిజనులు

రూ. 47 వేలు చెల్లిస్తే 5 లక్షల చెక్కు పంపుతామని లెటర్‌

ఐదుగురు గిరిజనులకు సీఎం కార్యాలయం పేరుతో లెటర్‌

పోలీసులను, జూలకంటిని ఆశ్రయించిన గిరిజనులు

మిర్యాలగూడ : ఫోన్‌ చేసి ఎటీఎం నంబర్‌ చెప్పమనడంతోపాటు పిన్‌నంబర్‌ చెప్పాలని అమాయకులను సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. కానీ ఏకంగా సీఎం కార్యాలయ అడ్రస్‌ పేరుతోనే సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌) కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోకపోయినా సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరైందని ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో లెటర్‌  వచ్చింది.

అది చూసిన గిరిజనులు అవాక్కయ్యారు. అడవిదేవులపల్లి మండలం ముల్కచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుకుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులు కరోం టోతు సేవా, అజ్మీరా శ్రీను, కుర్రా సేవ, మేరావత్‌ బోడ్కా, కుర్రా మంగ్తాల పేరున స్పీడ్‌పోస్టు ద్వారా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఐదు లక్షల రూపాయల మంజూరైనట్లు లెటర్లు (ఎల్‌ఆర్‌.70/సీఎంఆర్‌ఎఫ్‌ – ఎల్‌ఓసి 2018, 12–05–2018) వచ్చాయి.

 అందుకు ఈ నెల 21వ తేదీ లోగా 47 వేల రూపాయలు ఎకౌంట్‌లో వేయాలని (సెక్రటేరియట్‌ ఆఫీసర్‌ కిరణ్‌ కుమార్‌ ఎకౌంట్‌ నెం. 6220181 2298 ఎస్‌బీఐ) కోరారు.  47 వేల రూపాయలు ఎకౌంట్‌లో వేసిన తర్వాత ఈ నెల 26వ తేదీ వరకు ఐదు లక్షల రూపాయల చెక్‌ స్పీడ్‌ పోస్టు ద్వారా ఇంటికి వస్తుందని లెటర్‌లో పేర్కొన్నారు. 

ప్రతులు కేటీఆర్‌కు పంపినట్లుగా:

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు గిరిజనులతో పేరున పంపడంతోపాటు తెలంగాణ ఐటీ మంత్రి, కల్వ కుంట్ల తారక రామారావుకు కూడా పంపినట్లుగా లెటర్‌లో పేర్కొన్నారు. ఈ లెటర్‌ను కిరణ్‌కుమార్, సెక్రటేరియట్‌ బిల్డింగ్, 5వ అంతస్తు, సీ–బ్లాక్, హైదరాబాద్‌ పేరుతో ఉంది. దానిలో ఫోన్‌ నెం, 040–23450461 ఉండటం, లెటర్‌పైన ప్రభుత్వ అధికారిక రాజముద్ర ఉండడం గమనార్హం. 

తెలిసిన వారే ఉండవచ్చునని అనుమానం

బంగారికుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు మంజూరైనట్లుగా వచ్చిన లెటర్‌లను పరిశీలిస్తే తెలిసిన వారే ఈ పనిచేశారని అర్థమవుతుంది. గిరిజనుల పేరుతోపాటు వారి తండ్రి పేరును పూర్తి అడ్రస్‌ను లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు లెటర్‌లో ఉన్న ఎకౌంట్‌ నంబర్, పూర్తి వివరాలను సేకరిస్తే బయటపడే అవకాశాలు ఉన్నాయి.

పోలీసులను, జూలకంటిని ఆశ్రయించిన గిరిజనులు

ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు మంజూరైనట్లు లెటర్‌ రావడంతో బంగారికుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా మా జీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని ఆశ్రయిం చారు. దీంతో నకిలీ లెటర్‌గా గుర్తించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు మంజూరైతే డబ్బులు ఎకౌంట్‌లో ఎందుకు వేయమంటారని భావించిన వారు నకిలీ లెటర్‌ అని తెలుసుకున్నారు.

ఇంటికి లెటర్‌లు వచ్చాయి 

మాకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ 5 లక్షల రూపాయలు మంజూ రైనట్లు ఇంటికి లెటర్‌లు వచ్చాయి. ముందుగా 47 వేల రూపాయలు కిరణ్‌కుమార్‌ ఎకౌంట్‌లో వేయాలని కోరారు. ఆ తర్వాత ఐదు లక్షల రూపాయలు పోస్టులో పంపుతామని లెటర్‌లో ఉంది.

మొదట్లో ప్రభుత్వం పేరుతో లెటర్‌ రావడం వల్ల మేము కూడా నమ్మాము. కానీ ముందుగా ఎకౌంట్‌లో డబ్బులు వేయాలని ఉండటం వల్ల జూలకంటి రంగారెడ్డి వద్దకు వచ్చాం. – అజ్మీరా శ్రీను, మేరావత్‌ బోడ్కా, అడవిదేవులపల్లి

విచారణ జరిపించాలి 

సీఎం కార్యాలయం పేరుతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు మంజూరయ్యాయని వచ్చిన లెటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. లెటర్‌లో ఉన్న కిరణ్‌కుమార్‌ ఎకౌంట్‌ను కూడా పరిశీలించాలి. సీఎం కార్యాలయం పేరుతో వచ్చిన లెటర్‌ కావడం వల్ల పోలీసులు పూరి ్తస్థాయి విచారణ జరిపి ఇలాంటి లెటర్‌లు పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గి రిజనులు నమ్మకపోవడం వల్లే మోసపోలేదు. 

– జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

మరిన్ని వార్తలు