ప్రసవానికొస్తే ప్రాణం పోయింది..

7 Mar, 2018 07:27 IST|Sakshi
సూర్యవాణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు

సూర్యవాణి ఆస్పత్రిలో శిశువు.. హైదరాబాద్‌కు తరలిస్తుండగా తల్లి మృతి

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు

ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారుల డిమాండ్‌

జనగామ: నిండు గర్భిణి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోకి ప్రసవానికి వస్తే ఆమెకు పుట్టిన శిశువుతోపాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జనగామలోని స్వర్ణ కళామందిర్‌ థియేటర్‌ సమీపంలోగల సూర్యవాణి ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన వాతాల లలిత(30) నిండు గర్భిణి కావ డంతో భర్త యాదగిరి ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సూర్యవాణి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు.

రాత్రి లలితకు ఆపరేషన్‌ చేయగా, కడుపులోనే మగ బిడ్డ చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతిచెందిన శిశువును అదే రోజు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి లలిత పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లకు సమాచార మిచ్చినా పెద్దగా స్పందించలేదు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన డాక్టర్‌ లలిత పరిస్థితి విషమంగా ఉందని ఆగమేఘాల మీద అంబులెన్స్‌ మాట్లాడి హైదరాబాద్‌కు పంపించారు. ఆస్పత్రికి వెళుతున్న క్రమంలో ఉప్పల్‌ సమీపంలో లలిత మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

కేవలం ఆపరేషన్‌ చేసే సమయంలో అలసత్వం వహించడంతోనే శిశివు, లలిత మృతి చెందినట్లు బంధువు దయాకర్‌ ఆరోపించారు. లలిత కడుపు భాగంలో పక్క నుంచి రక్త కారుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిబ్బందితోనే పని కానిచ్చేశాకరని, వైద్యులు కూడా అందుబాటులో లేరన్నారు. సూర్యవాణి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుం బ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పదిహేనేళ్ల క్రితం కూతురు మృతి
మృతురాలి పెద్ద కూతురు అనూష సరిగ్గా పదిహేనేళ్ల క్రితం మార్చి 3న విద్యుదాఘాతంతో మృతిచెందింది. తొమ్మిదేళ్ల వయస్సులో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను ఒంటరి చేసి వెళ్లి పోయింది. మరో పాప కోసం పదిహేనేళ్ల తర్వాత ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన లలిత కడుపులోనే రాత్రి శిశువు(మగబిడ్డ) మృతి చెందగా... మరుసటి రోజు తల్లి అనంతలోకాలకు చేరడంతో భర్త.. కుటుంబ సభ్యులు పుట్టెడు ఖంలో మునిగి పోయారు.

మా తప్పేమీలేదు : డాక్టర్‌ స్వప్న
లలితను అడ్మిట్‌ చేసే సమయంలో ఆమె క్రిటికల్‌ కండిషన్‌లో ఉంది. భర్త అనుమతి తీసుకున్న తర్వాతే ఆపరేషన్‌ మొదలు పెట్టాం. లలిత కడుపులోనే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశాం. రాత్రి సమయంలో పక్కనే ఉన్న కుటుంబసభ్యులు వాటర్‌ తాగించడంతో పరిస్థితి విషమించినట్లు గుర్తించాం. లలితకు బీపీ, షుగర్‌ ఉంది. ఆపరేషన్‌లో ఎలాంటి లోపం లేదు.  

మరిన్ని వార్తలు