లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు

7 Dec, 2019 04:25 IST|Sakshi

సోదరి ప్లాన్‌తో మహిళను హతమార్చిన దుండగులు

ఒంగోలు: ఆస్తి వివాదం నేపథ్యంలో ఆరేళ్ల క్రితం ఓ మహిళపై లైంగిక దాడి జరిపి హతమార్చిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం అదనపు జిల్లా జడ్జి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. భూచేపల్లి నాగరత్నమ్మ, రావూరి మంగమ్మ అక్కాచెల్లెళ్లు. భూచేపల్లి నాగరత్నమ్మ చీమకుర్తి మండలం దేవరపల్లిలో ఉంటోంది. వారి మధ్య ఆస్తి వివాదాలు నెలకొనగా.. మంగమ్మ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనికి నాగరత్నమ్మే కారణమని భావించిన మంగమ్మ సోదరిని హతమార్చేందుకు ప్లాన్‌ చేసింది. భర్త చనిపోయినందున ఆలయంలో నిద్ర చేయడానికి తోడు రావాలని సోదరి నాగరత్నమ్మను కోరింది. ఆమె వెంట వెళ్లిన నాగరత్నమ్మపై పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద  నాగదాసరి వెంకటయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనంతరం ఏడుగురు కలిసి ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నాగరత్నమ్మ సోదరి రావూరి మంగమ్మ, మీసాల నాగేంద్రం అలియాస్‌ నాగిరెడ్డి, మందగలం బాబు, నాగదాసరి వెంకటయ్యలతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో నలుగురు కడప జిల్లాకు చెందిన వారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మార్కాపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పును వెలువరిస్తూ.. నాగరత్నమ్మపై అత్యాచారం చేసిన నాగదాసరి వెంకటయ్యకు పదేళ్ల జైలు శిక్షతోపాటు ఆమెను హతమార్చినందుకు జీవిత ఖైదు విధించారు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మంగమ్మ, మీసాల నాగేంద్రం , మందగలం బాబుకు జీవిత ఖైదు విధించారు. మిగిలిన ముగ్గురినీ  నిర్దోషులుగా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు