భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

28 Sep, 2019 09:02 IST|Sakshi
ముద్దాయిని పుళల్‌ జైలుకు తరలిస్తున్న పోలీసులు

సాక్షి, తిరువళ్లూరు(చిత్తూరు) : భర్తను హత్య చేసినందుకు ఓ మహిళకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఐదు వేలు రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి దీప్తి అరువునిధి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు చిత్తూరు జిల్లా నాగాలాపురం బీసీ కాలనీకి చెందిన గౌరి(23)కి తిరువళ్లూరు జిల్లా పట్టాభిరాం తండరై ప్రాంతానికి చెందిన రాజీ(27)తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన రాజీ తరచూ గౌరీని వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 13న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజీ భార్యతో ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులను తట్టుకోలేనీ గౌరి అతని తలపై రుబ్బురోలు రాయితో కొట్టి  హత్య చేసింది. తిరువళ్లూరు జిల్లా అదనపు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి దీప్తి అరువునిధి తీర్పును వెలువరించారు. గౌరికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించినట్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోహన్‌రావు మీడియాకు వివరించారు. అనంతరం ముద్దాయిని పుళల్‌ జైలుకు తరలించారు. 

 

మరిన్ని వార్తలు