బతికున్నవారిని చనిపోయినట్లుగా చూపి..

5 Jun, 2019 08:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

190 నకిలీ బీమా పత్రాలతో రూ.3 కోట్లు స్వాహా 

ఎల్‌ఐసీ ఆఫీసర్లు, ఏజెంట్లు కుమ్మక్కు 

బతికున్న తండ్రి పేరిట బీమాను మింగేసిన అధికారి

కోదాడలో వెలుగుచూసిన బీమా కుంభకోణం

సాక్షి, హైదరాబాద్‌: బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్‌.ఐ.సి సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కయిన ఈ కుంభకోణంలో మొత్తం రూ.3.13 కోట్ల ఎల్‌.ఐ.సి. డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. వివరాలు.. కోదాడ ఎల్‌.ఐ.సి కార్యాల యంలో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్‌ బీకూనాయక్, హయ్యర్‌ గ్రేడ్‌ అసిస్టెంట్‌ గులోతు హర్యా (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) మరో ఉద్యోగి పి.రఘుచారి 8 మంది ఎల్‌.ఐ.సి. ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారు. నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్‌.ఐ.సి.కి చెందిన రూ.3,13,78,733 డ్రా చేసుకున్నారు. పత్రా ల్లో పేర్కొన్న నామినీల బ్యాంకు ఖాతాల్లో కాకుండా  సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు.  

సొంత తండ్రినీ వదల్లేదు.. 
2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి రూ.3 కోట్లకుపైగా తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బీకూ నాయక్‌ తన తం డ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించడం గమనార్హం. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్‌.ఐ.సి. చీఫ్‌ మేనేజర్‌ ఎడ్ల వెంకటేశ్వర్‌రావు విచారణ జరిపారు. అంతర్గత విచారణంలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో బీకూనాయక్, గుగులోత్‌ హర్యా, ఏజెంట్లు పి.రఘుచారి, ఎ.కొండయ్య, పి.సురేశ్, ఎం.దానమూర్తి, టి.సరేందర్‌రెడ్డి, బి.విజయ్‌కుమార్, వి.సైదాచారి, భూక్యా రవి, కల్వకుంట్ల వెంకన్నలపై ఐపీసీ 120(బి), 409, 420, 465, 467, 468, 471, 477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు