ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య

12 Jul, 2018 16:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అల్లుడిని హత్య చేసిన మామకు జీవిత ఖైదు

సాక్షి, అమలాపురం టౌన్‌: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్‌ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్‌ఐ బి.జనార్దన్‌ నమోదు చేయగా రూరల్‌ సీఐ జి. దేవకుమార్‌ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించారు.   

మరిన్ని వార్తలు