కోడలి కుటుంబం నుంచి రక్షించండి

3 Jul, 2018 12:57 IST|Sakshi

పోలీస్‌ ప్రజాదర్బార్‌లో పెద్దహుల్తి గ్రామ వాసి ఫిర్యాదు

సమస్యలపై వినతులు స్వీకరించిన ఎస్పీ గోపీనాథ్‌ జట్టి

కర్నూలు: కోడలు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన హుల్తెన్న ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్‌ జట్టి పోలీస్‌ ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 ఫోన్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జి ల్లా వ్యాప్తంగా మొత్తం 67 ఫిర్యాదులు వచ్చాయి. 

ఫిర్యాదుల్లో కొన్ని...  
ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని చెప్పి తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీతో నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి మోసం చేసినవారిని శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.  
తన పొలంలోకి రానివ్వకుండా కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన రామనాథ అయ్యమ్మ వాపోయింది. భూ సమస్య గురించి కొంతమంది నుంచి ప్రాణహాని ఉందని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది.  
ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొందరు పేకాట నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు.  
కర్నూలు నగరంలో నెలనెలా స్కీమ్‌ల పేరుతో కొందరు డబ్బులు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలు కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు.
తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలాన్ని కుమారుడు కౌలుకు తీసుకుని 12 ఏళ్లైనా ఇంతవరకు డబ్బు ఇవ్వకపోగా జీవనాధారం కోసం పొలాన్ని అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నాడని, న్యాయం చేయాలని శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి సుంకమ్మ ఫిర్యాదు చేసింది. చీకటి పడితే కళ్లు సరిగా కనిపించవని, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తనకు పొలాన్ని రాసిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
తమ కుమార్తెను అనుమానంతో హత్య చేశారని కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన నేరేడు చిన్నయ్య ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాదర్బార్, డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్‌ ఎస్పీ షేక్షావలి, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు నజీముద్దీన్, బాబుప్రసాద్, వెంకటాద్రి, వినోద్‌కుమార్, సీఐలు ములకన్న, పవన్‌కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు