కామాంధులకు కటకటాలు

16 Oct, 2019 11:17 IST|Sakshi

కుమార్తెపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మైనర్‌పై లైంగిక దాడి కేసులో మరొకరికి..

చాదర్‌ఘాట్‌:  సొంత కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 1వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేట వాహెద్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై అతని కుటుంబ సభ్యులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన 1వ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల మంగళవారం నిందితుడికి  జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఆరు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

బాలికపై లైంగికదాడి కేసులో..
రంగారెడ్డిజిల్లా కోర్టు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితునికి జీవిత ఖైదు, రూ. 5వేల జరిమానా విధిస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్‌ జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు ప్రాసిక్యూటర్‌ రాజిరెడ్డి  కథనం ప్రకారం.. మూసాపేట జనవానగర్‌ కాలనీకి చెందిన సరస్వతి, అప్పల స్వామి దంపతులకు ముగ్గురు సంతానం. వీరి చిన్న కుమార్తె (15) 2016 ఏప్రెల్‌ 28న సరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారు అదే ప్రాంతానికి చెందిన కృష్ణపై అనుమానం వ్యక్తం చేస్తూ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2016 జూన్‌ 16న బాధితురాలిని విచారించగా  కృష్ణ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన స్వస్థలం ఒరిస్సాకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు తెలి పింది.  తాను గర్బం దాల్చడంతో తనను ఇంటివద్ద వదిలి వెళ్లినట్లు పేర్కొంది.  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని  రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు సాక్ష్యాధారాలు పరిశీలించిన సైబరాబాద్‌ 14వ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి నర్సింగరావు  నిందితునికి పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

మరిన్ని వార్తలు