వంద రోజుల ప్రణాళిక

12 Aug, 2018 07:22 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీసీ జయసేనారెడ్డి

మహబూబ్‌నగర్‌క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలను అరికట్టడంతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ అమలు, సమయపాలనను పరిశీలించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జయసేనారెడ్డి వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని డీసీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రణాళిక వివరాలు వెల్లడించారు.
 
ప్రతీరోజూ.. ప్రతీ స్టేషన్‌ 
ఉమ్మడి జిల్లాలో గుడుంబ నియంత్రణ, కల్తీ కల్లు నియంత్రణ, బెల్టు దుకాణాలను అదుపు చేయడంపై ఈ వంద రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని డీసీ తెలిపారు. ఈ ప్రణాళికను ఉమ్మడి జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని.. ప్రతీ రోజు, ప్రతీ స్టేషన్‌ ఆధ్వర్యాన ఒక కార్యక్రమం చేపడుతామన్నారు. ప్రణాళికలో తొలి 25రోజుల పాటు ‘ఏ’ గ్రేడ్‌ గ్రామాల్లో తనిఖీలు, ఆ తర్వాత 25రోజుల పాటు ‘బీ’ గ్రేడ్‌ గ్రామాలు, మరో 25 రోజులు ‘సీ’ గ్రేడ్‌ గ్రామాల్లో తనిఖీలు చేశాక చివరి 25రోజులు అన్ని గ్రామాల్లో క్రాస్‌ తనిఖీలు ఉంటాయని తెలిపారు. ఈ తనిఖీలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కాకుండా ఇతర స్టేషన్ల చెందిన సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.

రాబోయో 25రోజుల్లో జిల్లాలో 104తనిఖీలు, 111మంది బైండోవర్లు, 134సార్లు పరిశీలన 97శాతం కల్తీ కల్లు, నాటుసారాను కట్టడి చేయనున్నామని వివరించారు. కాగా, గతంలో బైండోవర్‌ అయిన వ్యక్తులు మళ్లీ అవుతున్నారా అనే అంశాన్ని సిబ్బంది ప్రత్యేకంగా పరిశీలిం చాలని, మద్యం దుకాణాలు సమయపాలన, పర్మిట్‌ రూం నిబంధనలు అమలుచేస్తు న్నాయా, లేదా అని చూడడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

ఫిర్యాదులకు అవకాశం 
జిల్లాలో ఎక్కడైనా సారా తయారీ, కల్తీ కల్లు అమ్మకాలతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎవరైనా టోల్‌ప్రీ నంబర్‌ 18004252523కు ఫోన్‌ చేయొచ్చని డీసీ జయసేనారెడ్డి తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయాలనుకుంటే 94409 02282( మహబూబ్‌నగర్‌ డీసీ) 94409 02607(మహబూబ్‌నగర్‌ ఈఎస్‌) 94409 02606 (జోగుళాంబ గద్వాల, వనపర్తి ఈఎస్‌), 94409 02613 (నాగర్‌కర్నూల్‌ ఈఎస్‌)కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జోగుళాంబ గద్వాల, వనపర్తి ఇన్‌చార్జి ఈఎస్‌ విజయ్‌భాస్కర్, ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు