లాటరీ మోసగాడి కోసం గాలింపులు

14 Sep, 2019 11:34 IST|Sakshi

సాక్షి, చిత్తూరు(రొంపిచెర్ల) : తక్కువ వడ్డీకి రుణాలు..డబ్బులు కడితే లాటరీలో స్టీల్‌  వస్తువులు ఇస్తామంటూ అందిన కాడికి దండుకుని బోర్డు తిప్పేసిన లాటరీ మోసగాడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రొంపిచెర్లలో ఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకుడు ఎస్‌ సాఫిక్‌ బాషా రాత్రి రాత్రికే అదృశ్యమవడం విదితమే. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాని చెందిన కొందరు పీలేరు మండల కేంద్రంలో రెండేళ్ల క్రితం ఎస్‌ఎస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో ఆఫీసు తెరచి,  రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, కల్లూరు, కలికిరి, కలకడ, మహల్‌ ప్రాంతాల ప్రజల నుంచి డబ్బులు వసులు చేశారు.

50పైసలకే రుణాలట!
వంద రూపాయలకు నెలకు 50పైసలు వడ్డీతో రుణాలు ఇస్తామని మహిళలను బురిడీ కొట్టించినట్లు తేలింది. నిర్వాహకుల మాటలు నమ్మి మహిళలు సంఘాలుగా ఏర్పాటై డబ్బులు కట్టారు. నెలకు రూ1600 కడితే రూ.35వేలు, నెలకు రూ2.500 కడితే రూ50 వేలు రుణంగా ఇస్తామని నమ్మబలకడంతో ఎక్కువ మంది అప్పు చేసి కొందరు, బంగారు నగలు తాకట్టు పెట్టి మరికొందరు రూ8 వేల నుంచి 35 వేల వరకు ఈ నెల 7,8 తేదీలలో  చెల్లించారు. వీరందరికీ 9న రుణాలు ఇస్తామన్న నిర్వాహకుడు జంప్‌ అయ్యాడు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

నిందితులు తమిళనాడు వాసులని ప్రాథమికంగా తేలింది. విచారణలో కేవలం 40 మంది దగ్గర మాత్రమే  రూ 40 వేలకు రశీదులు ఉన్నాయని ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన వారి దగ్గర ఎలాంటి రశీదులు లేవని చెప్పారు. సాఫిక్‌బాషా అనేది నిందితుడి అసలు పేరు కాదని,  త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఇదలా ఉం చితే, మా గ్రూపునకు రూ.5లక్షల రుణం ఇస్తామని చెప్పడంతో రూ.35వేలు కట్టామని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన చోటీ బీ, రూ.50వేల రుణం కోసం నగలు తాకట్టు పెట్టి రూ.12,500 కట్టానని ఇమాన, రూ.1.5లక్షల రుణం కోసం రూ.25వేలు వడ్డీకి తెచ్చి గ్రూపు తరఫున కట్టానని హైస్కూలు వీధికి చెందిన పర్వీన్‌ తామెలా మోసపోయామో చెప్పుకొచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా