తెనాలి వాసి ఉలవపాడులో లాకప్‌డెత్‌!

8 Oct, 2018 13:45 IST|Sakshi
తల్లిదండ్రులను విచారిస్తున్న ఆర్డీవో, డీఎస్పీ

కారు దొంగతనం కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అర్ధరాత్రి గుండెనొప్పి వచ్చిందంటూ ఆస్పత్రికి తరలింపు

అప్పుడే మృతి చెందాడని చెబుతున్న పోలీసులు

కొట్టి చంపారంటున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు

తెనాలిలో నివాసం ఉంటున్న మృతుడు

ప్రకాశం, కందుకూరు: కారు దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు ఉన్నట్టుండి మృతి చెందడం అనుమానాస్పదంగా మారింది. నిండా 30 ఏళ్లు కూడా లేని యువకుడు గుండెపోటుతో మృతి చెందాడంటూ పోలీసులు చెబుతుంటే బంధువులు మాత్రం పోలీసులే కొట్టి చంపారంటూ ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఉలవపాడు పోలీసుస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి తల్లిదండ్రులు, బంధువులతో రాజీ చేసుకుని కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు సాగించినట్లు సమాచారం.

తెరపైకి భిన్న వాదనలు..
కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై కారు మాయమైనట్లు కావలికి చెందిన చేవూరి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గత నెల 4వ తేదీన ఉలవపాడు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. కారును పాత నేరస్తుడు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఎలిపోడు గ్రామానికి చెందిన బాబర్‌బాషా(28) చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం పోలీసులు కొంతకాలంగా వెతుకుతున్నారు. శనివారం నెల్లూరులో ఉన్నట్లు గుర్తించిన ఉలవపాడు పోలీసులు అక్కడికి వెళ్లి శనివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నుంచి ఉలవపాడు తీసుకొచ్చే సరికి గుండెల్లో నొప్పి వస్తున్నట్లు బాబర్‌బాషా తెలపడంతో పోలీసులు అర్ధరాత్రి 11.10 గంటల సమయంలో ఉలవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ గుండెపోటుతో బాబర్‌బాషా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అదుపులో ఉన్న యువకుడు అర్ధరాత్రి మృతి చెందినా బయటకు రాకుండా చూసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి బంధువులు చెబుతున్న వాదన మరో విధంగా ఉంది. పోలీసులు కొట్టి హింసించడం వల్లే బాబర్‌ మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు.

తెనాలిలో అదుపులోకి!
ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై కారు దొంగతనం చేసిన బాబర్‌ బాషా కారును గుంటూరులోని ఓ వ్యక్తికి అమ్మినట్లు సమాచారం. ప్రస్తుతం ఓ యువతిని పెళ్లి చేసుకుని తెనాలిలో నివాసం ఉంటున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కారును బాబర్‌బాషానే దొంగతనం చేసినట్లు గుర్తించిన పోలీసులు మూడు రోజుల క్రితమే తెనాలిలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. మూడు రోజుల నుంచి ఉలవపాడు స్టేషన్‌లోనే ఉంచి పోలీసులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేసే సమయంలోనే అర్ధరాత్రి ఉలవపాడు స్టేషన్‌లోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. లాకప్‌డెత్‌ను పక్కదారి పట్టించేందుకు పోలీసులు కొత్త నాటకానికి తెరలేపారనే వాదన ఉంది. ఉలవపాడు పీహెచ్‌సీలో మృతి చెందినట్లు చెబుతున్న పోలీసులు అక్కడి నుంచి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు.

నా బిడ్డకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు: తల్లిదండ్రులు
బాబర్‌బాషా శనివారం అర్ధరాత్రి మృతి చెందినా తల్లిదండ్రులు, బంధువులకు పోలీసులు విషయం చెప్పలేదు. ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బాబర్‌బాషా స్వగ్రామం ఎలిపోడు గ్రామానికి వెళ్లి పోలీసులు తమ కొడుకు ఆరోగ్యం బాగా లేక హాస్పటల్‌లో చేర్చామంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు  తమను కందుకూరు రమ్మన్నారని తల్లి కరిమున్నీసా చెబుతోంది. పోలీసులే కొట్టి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  

తల్లిదండ్రులతో రాజీ..
ఈ కేసు నుంచి బయట పడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. మృతుడి తల్లిదండ్రులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యవర్తుల ద్వారా పోలీసులు చర్చలు జరిపారు. చివరకు పోలీసుల ప్రయత్నాలు ఫలించి తల్లిదండ్రులకు కొంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో  ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కందుకూరు నుంచి తీసుకెళ్లారు.

కస్టోడియల్‌ డెత్‌గానే కేసు: డీఎస్పీ
యువకుడి మృతికి సంబంధించి కస్టోడియల్‌ డెత్‌ కింద కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. దీనిపై చీరాల డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ రామారావులు విచారణ చేపడతారన్నారు. పోలీసులు నెల్లూరు నుంచి ఉలవపాడు తీసుకొచ్చే సమయంలో గుండెపోటు రావడం అక్కడి నుంచి పీహెచ్‌సీకి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందినట్లు డీఎస్పీ వివరించారు. 

మరిన్ని వార్తలు