లాకప్‌ డెత్‌..?

19 Aug, 2019 06:39 IST|Sakshi
మృతురాలు లీలాబాయ్‌

మహిళా పోలీసు స్టేషన్‌లో ఘటన

విచారణకు తీసుకొచ్చిన మహిళ మృతి

వళ్లియూరులో ఉద్రిక్తత

సాక్షి, చెన్నై: మహిళా పోలీసుస్టేషన్‌లో విచారణ నిమిత్తం తీసుకొచ్చిన మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు కొట్టి చంపేశారంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.తిరునల్వేలి జిల్లా కూడంకులం అణు విద్యుత్‌కేంద్రం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నాగర్‌కోయిల్‌కు చెందిన క్రిస్టోఫర్‌ పనిచేస్తున్నాడు. ఇతను గతవారం అక్కడి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు వెలుగు చూసింది. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన క్రిష్టోఫర్‌ కోసం వళ్లియూరు పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అతడి సెల్‌ నంబర్‌ ఆధారంగా ఓ క్లూను సేకరించారు. క్రిష్టోఫర్‌ తరచూ పూమత్తి విలైకు చెందిన ఇజ్రేయల్‌ భార్య లీలాబాయ్‌(45)తో మాట్లాడుతూ వచ్చినట్టు తేలింది. దీంతో ఆమెను విచారిస్తే క్రిస్టోఫర్‌ ఎక్కడున్నాడో అన్నది తేలుతుందని వళ్లియూరు మహిళా పోలీసుస్టేషన్‌ వర్గాలు భావించాయి.

దీంతో శనివారం రాత్రి లీలాబాయ్‌ను విచారణ నిమిత్తం వళ్లియూరు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆమె వద్ద మహిళా పోలీసులు తమదైన పద్ధతిలో విచారించినట్టుంది. ఆదివారం ఉదయాన్నే హఠాత్తుగా లీలాబాయ్‌ వాంతులు చేసుకుంది. రక్తం వచ్చే రీతిలో వాంతులు చేసుకుని స్పృహ తప్పింది. ఆందోళనకు గురైన ఆ స్టేషన్‌ మహిళా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీహెచ్‌కు తరలించారు. అయితే చనిపోయిన మహిళను మహిళా పోలీసులే కొట్టి చంపేశారన్న సమాచారంతో పూమత్తి విలైలోన మృతురాలి బంధువుల్లో ఆగ్రహం రేగింది. వారు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాన్ని బుజ్జగించారు. విచారణకు ఆదేశించారు. కాగా, ఆ మహిళాస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శాంతి సెలవులో ఉండడం, నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌ అనిత అదనపు బాధ్యతలు స్వీకరించి, ఈ కేసును విచారిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీసుల వద్ద ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు