చిన్న తప్పిదం.. పెద్ద ప్రమాదం

9 Jan, 2019 13:28 IST|Sakshi
హైవేపై బోల్తా పడిన ఆర్టీసీ హైటెక్‌ బస్సు

ముంగమూరుతోటల వద్ద రోడ్డు ప్రమాదం

బస్సును ఢీకొన్న కంటైనర్‌ లారీ

27 మందికి స్వల్ప, నలుగురికి తీవ్రగాయాలు  

కావలి ఆస్పత్రికి తరలింపు

నెల్లూరు , బిట్రగుంట: ద్విచక్ర వాహనదారుడు చేసిన చిన్న తప్పిదం కారణంగా బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ లారీ అదుపుతప్పి ఆర్టీసీ హైటెక్‌ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండూ వాహనాలు బోల్తాపడ్డాయి. బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. బస్సులో క్షతగాత్రులు ఇరుక్కుపోవడంతో 20 నిమిషాలపాటు ప్రమాద స్థలిలో గందరగోళం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ హైటెక్‌ బస్సు వెళుతోంది. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో బస్సు ముంగమూరు కూడలి సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో ముంగమూరు నుంచి కావలి వెళ్లేందుకు ఓ వ్యక్తి మోటార్‌బైక్‌పై అడ్డదిడ్డంగా రోడ్డు దాటేందుకు ప్రయతిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి మామిడి రసంతో ఒడిశాలోని కుర్వా ప్రాంతానికి వెళుతున్న కంటైనర్‌ లారీ బైక్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పి హైటెక్‌ బస్సును ఢీకొంది. దీంతో బస్సు హైవేపై బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కంటైనర్‌ లారీ కూడా హైవేపైనే బోల్తా పడింది.

ఏరియా ఆస్పత్రికి తరలింపు
బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అందులో 30 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. చాలామంది చేతులు, తలకు బలమైన గాయాలు తగిలాయి. ఒక మహిళా ప్రయాణికురాలి చేయి తెగి రోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న బిట్రగుంట, కావలి రూరల్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కావలి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

గాయపడ్డ ప్రయాణికుల వివరాలు..
ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్‌ చార్ట్‌ ప్రకారం 35 మంది ప్రయాణికులుండాల్సి ఉండగా 30 మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరుకు చెందిన వారున్నారు. వారిలో కె.కోటేశ్వరమ్మ, కె.జీవన్‌కుమార్‌ అయ్యప్ప, పి.వేణుగోపాల్, ఎం.వెంకటరమణ, వై.చిట్టిబాబు, వై.బాబూరావు, బి.రామకృష్ణ, కె.భారతి, కె.సూర్యచంద్రరావు, బి.వేణుగోపాల్, సీహెచ్‌ శ్రీనివాసులు, రామచంద్రరావు, హజరత్‌రెడ్డి, కె.శ్రీలేఖ, శిరీష, పద్మ, రాము, వంశీ కుమార్, కుసుమ, గోపి, సూర్యావతి, శ్రీరాములు, విజయ, నరసమ్మ, శ్రీను, శాంతి, సీత, తదితరులు గాయపడ్డారు. ఇద్దరు బస్సు డ్రైవర్లు ఉడతా వెంకటేశ్వర్లు, కేవీ శేషయ్య, లారీ డ్రైవర్‌ ఎన్నం బాబూరావు, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఆరుగురు ప్రయాణికులు ప్రథమ చికిత్స అనంతరం వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు డీజిల్‌ ట్యాంక్‌ పక్కన లారీ బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్యాంక్‌కు తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదతీవ్రతకు డీజిల్‌ ట్యాంక్‌ పగిలి ఉంటే మంటలు వ్యాపించి ఊహించని నష్టం వాటిల్లేది.

స్పందించిన పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే కావలి రూరల్, బిట్ర గుంట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాని కి చేరుకున్నారు. రూరల్‌ సీఐ మురళీకృష్ణ, బిట్ర గుంట ఎస్సై నాగభూషణం, ఆయా స్టేషన్ల సిబ్బం దితో పాటు ట్రైనీ ఎస్సైలు, హైవే మొబైల్‌ సిబ్బం ది క్షతగాత్రులను నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రులకు తరలించారు. క్రేన్‌ సహాయంతో లారీ, బస్సును పక్కకు తీయించేందుకు చర్యలు చేపట్టారు. సుమా రు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటైనర్‌ లారీ నుంచి మామిడి రసం రోడ్డంతా పరుచుకోవడంతో వాహ నాలు జారిపడకుండా రోడ్డంతా కడిగించారు. 

కావలిఅర్బన్‌: బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలివచ్చారు. తమవారిని చూసిన విలపించారు. సూపరింటెండెంట్‌ కె.సుబ్బారావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలందించారు.

మరిన్ని వార్తలు