లారీ డ్రైవర్‌ దారుణ హత్య

14 May, 2019 11:39 IST|Sakshi
లారీ డ్రైవర్‌ రమేష్‌ మృతదేహం

నోట్లో గుడ్డలు కుక్కి ఇనుపరాడ్‌తో దాడి

మృతుడు నెల్లూరువాసిగా పోలీసుల నిర్ధారణ

మద్యం సేవించి డ్రైవర్, క్లీనర్‌ గొడవ పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు

పరారైన క్లీనర్‌పై అనుమానాలు

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : లారీ డ్రైవర్‌ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సమీపంలో చోటుచేసుకుంది. నోట్లో గుడ్డలు కుక్కి, తలపై ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు.   రూరల్‌ రెండవ ఎస్‌ఐ హెచ్‌వై నాయుడు కథనం.. నెల్లూరు పట్టణం 6–91 దగదర్తి 4–6 బ్లాకులో కాపురం ఉంటున్న జి.రమేష్‌(31) నెల్లూరుకు చెందిన ఓ లారీ యజమాని వద్ద 11 ఏళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుంజి రామయ్య, కాంతమ్మ పక్షవాతంతో బాధపడుతుండడంతో కుటుంబ పోషణ, వారి సంరక్షణ బాధ్యతలు మోస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరులో ఫీడు లోడు వేసుకుని కర్ణాటకకు వెళ్లాడు.

అక్కడ సరుకును అన్‌లోడ్‌ చేసి ఆంధ్రాకు మరో బాడుగ మాట్లాడుకున్నాడు. మైసూరు నుంచి రాగుల లోడుతో సదుంకు బయల్దేరాడు. మదనపల్లె, కలికిరి మీదుగా సదుంకు వెళుతూ లారీని సీటీఎం రోడ్డులోని ఐదవ మైలు వద్ద్ద నున్న ఓ పెట్రోల్‌ బంకు వద్ద నిలిపాడు. క్లీనర్‌ మురళి(30)తో కలసి లారీపై కూర్చుని ఇద్దరూ మద్యం సేవించారు. భోజనం చేశాక అక్కడే ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం రాత్రి పది గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో క్లీనర్, డ్రైవర్‌ మురళి తల ఇనుపరాడ్డుతో దాడిచేసి హతమార్చాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మత్తు దిగాక క్లీనర్‌ ఉదయం పరారైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీడ్రైవర్, క్లీనర్‌ గొడవ పడినట్లు పెట్రోల్‌ బంకులోని సీసీ కెమెరాలో రికార్డు అయి ఉండటం గుర్తించారు. డ్రైవర్‌ నోట్లో గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఘటనపై పెట్రోల్‌ బంకులోని సిబ్బందిని ఆరాతీశారు. అయితే ఈ హత్యను క్లీనరే చేశాడా? లేక డబ్బుల కోసం ఇద్దరూ నిద్రలో ఉన్న సమయంలో మరెవరైనా చేశారా? అనేది తెలియరాలేదు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు