చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

16 Jun, 2018 22:31 IST|Sakshi
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేస్తున్న స్థానికులు, పోలీసులు

     లోయలో పడిన మామిడి కాయల లోడు లారీ

     తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీల మృతి

     21 మందికి తీవ్ర గాయాలు.. క్షతగాత్రులు వేలూరు, కుప్పం ఆసుపత్రికి తరలింపు

కుప్పం రూరల్‌: చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడటంతో తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంబట్టు గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం విజలా పురం గ్రామానికి వచ్చారు.

శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మామిడి కాయలు కోసి లారీలోకి నింపి అదే వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ వైపు జోరు వర్షం.. చిమ్మచీకట్లోనే లారీ వేలూరుకు ప్రయాణమైంది. కుప్పం మండలం పెద్దవంక సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఘాట్‌ వద్ద లారీ అదుపు తప్పి సుమారు 50 అడుగుల లోయలోకి బోల్తా కొట్టింది. మామిడికాయలతో పాటు కూలీలు లోయలోకి పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తమిళనాడు, ఏపీ పోలీసులకు సమాచారం అందించాడు.

అడవిలో మిన్నంటిన ఆర్తనాదాలు..
రోజంతా కష్టపడి అలసి సొలసి లారీలోనే కునుకుతీస్తున్న కూలీలు.. లారీ అదుపు తప్పిన విషయం తెలుసుకునే లోపే లోయలోకి జారిపోయారు. అర్ధరాత్రి అడవిలో కూలీల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

లారీ, మామిడికాయల కింద వున్న కూలీలను ఒక్కొక్కరిని వెలికి తీస్తున్నారు. అందులో ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు, కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు.  

మరిన్ని వార్తలు