లాటరీ పేరిట కుచ్చుటోపీ

10 Sep, 2019 10:48 IST|Sakshi
నిర్వాహకుడు ఇచ్చిన కార్డులు 

తొలిరోజు 5 రూపాయలు, రెండవ రోజు రూ.6, 3వ రోజు రూ.7..ఇలా రోజుకో రూపాయి పెంచుకుంటూ నెల తిరిగేసరికి రూ.656 చెల్లింపు..ఆపై లాటరీలో పలు రకాల వస్తువులు..చీప్‌ అండ్‌ బెస్ట్‌లో భలే బాగుంది స్కీమ్‌ అని పేద, మధ్య తరగతి మహిళలు ఎగిరి గంతేశారు..అడపాదడపా లాటరీలో చిన్నపాటి వస్తువులు ఇస్తూండడంతో సోషల్‌ మీడియా కంటే వీరి నోళ్లల్లో ఇది బాగా వైరల్‌ అయ్యింది. ఇంకేముంది? మరెందరో అమ్మలక్కలు ఈ లాటరీ స్కీమ్‌లో చేరిపోయారు. లాటరీ మాయలోడు అనుకున్న టార్గెట్‌ చేరుకునేసరికి రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దేశాడు. ఈసారి అందరి నోళ్లూ లబోదిబోమన్నాయి. మళ్లీ ఇది వైరల్‌ అయ్యింది!! 

సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : రైస్‌ కుక్కర్లు, స్టీల్‌ బిందెలు, కుర్చీలు..వంటసామాన్లు..వేటికైనా సరే రోజూ డబ్బులు కడితే లాటరీలో వస్తువులు ఇస్తామని నమ్మించి ఓ వ్యాపారి లక్షల రూపాయలు వసూలు చేసుకుని జెండా ఎత్తేశాడు. దీంతో బాధితులు గగ్గోలు పెట్టారు. వివరాలు.. పీలేరు వాసినంటూ ఎస్‌.సాఫిక్‌బాషా అనే ఓ వ్యక్తి ఆరేడు నెలల క్రితం స్థానిక బజారు వీధిలో ఒక ఇంటిని బాడుగకు తీసుకుని ఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట దుకాణం తెరిచాడు. మొదటి రోజున 5 రూపాయలు కడితే చాలు..ఆ తర్వాత రోజు నుంచి రోజూ రూపాయి కలుపుకుని కడితే చాలంటూ ఊదరగొట్టాడు. ఇది మహిళల నోట బాగా నానడంతో స్థానికంగా బాగా ప్రచారమైంది.

అడపాదడపా లాటరీ వేస్తూ వంద రూపాయల విలువ చేసే వస్తువులు ఆయా ప్రాంతాల్లో మహిళలకు ఇస్తూండడంతో వారికి నమ్మకం కలిగింది. పాసు పుస్తకం తరహాలో ఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట కార్డును మహిళలకు ఇచ్చి అందులో తీసుకున్న డబ్బుల వివరాలు ఎంట్రీ చేసేవాడు. దీంతో రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని ముత్యాలమ్మ గుడివీధి, పాళ్యెంవీధి, హైçస్కూల్‌వీధి, చిన్నమసీదువీధి, బలిజవీధి, శ్రీరాములగుడివీధి గ్రామాల్లో సుమారు 800 మంది నెల నెలా రూ656 చెల్లించారు. లాటరీ పేరిట వేస్తున్న వస్తువులకు మహిళలు మరింత ఆకర్షితులయ్యారు. దీంతో వందల మంది మహిళలు 6 నెలలుగా దాదాపు రూ20 లక్షల వరకూ    చెల్లించారు. అయితే ఆదివారం రాత్రి ఆ వ్యాపారి ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి అదృశ్యమయ్యాడు. 


బాధిత కుటుంబం

వ్యాపారి తమిళనాడు వాసేనా?
సోమవారం అతని దుకాణం తెరవకపోవడం, అతగాడు ఇచ్చిన సెల్‌ నంబర్‌ 97860 54496కు ఫోన్‌ చేస్తే ‘‘ఆప్‌ కీ ద్వారా డయల్‌ కియా గయా నంబర్‌ ఉపయోగ్‌ మే నహీ హై’’! అని వస్తూండడంతో అక్కడికి వచ్చిన మహిళలు గుండెల్లో రాయి పడినట్లైంది. తొలుత తమిళంలో ఇదే విషయం వస్తూండడంతో ఇతగాడు తమిళనాడు వాసి కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందకంటే గతంలో ఇలా లాటరీ, తక్కువ ధరకే వస్తువుల పేరిట జిల్లాలో దుకాణాలు తెరచి బిచాణా ఎత్తేసినవాళ్లంతా చాలావరకు తమిళనాడు వాసులే కావడం గమనార్హం!  లాటరీ వ్యాపారి జంప్‌ అయ్యాడనే  విషయం దావానలంలా వ్యాపించడంతో బాధితులు పోలో మంటూ దుకాణం వద్దకు చేరుకున్నారు. తాము మోసపోయామని గ్రహించి లబోదిబో మన్నా రు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో వ్యాపారి కోసం పీలేరులో గాలించారు. అలాంటి వ్యక్తి ఎవరూ పీలేరులో లేరని తెలియడంతో బావురుమన్నారు.

మరిన్ని వార్తలు