ప్రేమ పేరిట వంచన.. ప్రియుడు నిరాకరించాడని..

3 Feb, 2019 17:43 IST|Sakshi
ఎస్‌.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకూతుళ్లు

భువనేశ్వర్‌: ప్రేమ పేరిట బాలికను మోసం చేశాడు ఓ యువకుడు. తమకు న్యాయం చేయాలని బాలికతో పాటు తల్లి నాలుగు నెలలుగా గ్రామ పెద్దలు చుట్టూ తిరిగారు. నాలుగు రోజుల కిందట పోలీసుస్టేషన్‌కూ వెళ్లారు. అయినా న్యాయం దక్కలేదు. ఇక న్యాయం జరగదని భావించిన తల్లీకూతుళ్లు పోలీసుస్టేషన్‌ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం లక్కవరపుకోటలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు.. లక్కవరపుపేట మండలంలోని రేగ గ్రామానికి చెందిన బాలిక కళ్లేపల్లి గ్రామానికి చెందిన కోరాడ సాయిశంకర్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు. విషయం కాస్త బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సాయిశంకర్‌ను నిలదీశారు.

నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టారు. ప్రేమికులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలని సాయిశంకర్‌కు చెప్పారు. దీనికి ప్రియుడు నిరాకరించాడు. తరువాత పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుం డా పోయింది. దీంతో నాలుగు రోజుల కిందట బాలిక తన తల్లి దండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు సాయిశంకర్‌తో పాటు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను స్టేషనకు రప్పించి చర్చిం చారు. అయినా సాయిశంకర్‌ నిరాకరించాడు. 

కేసులొద్దు...
తనకు సాయిశంకర్‌తో పెళ్లి చేయాలని, కేసులొద్దని బాలిక పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగింది. స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా బాలిక ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక తన తల్లితో పోలీసుస్టేషన్‌కు వచ్చి మరోసారి పోలీసులకు విన్నవించింది. దీంతో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీ సుస్టేషన్‌ వెలుపలికి వచ్చి ఇంటి నుంచి తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా తాగేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. తల్లీకూతుళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు