గండికోటలో ప్రేమజంట కథ విషాదాంతం

1 Nov, 2019 06:41 IST|Sakshi

తల్లిదండ్రులపై భయంతో విషం తాగిన జంట

గండికోటలో విషాద సంఘటన

సాక్షి, జమ్మలమడుగు: కలిసి చనిపోదామని ఓ యువజంట చేసిన ప్రయత్నంలో ఒకరు విషాదాంతమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గండికోటలో గురువారం ఈ సంఘటన జరిగింది. వివరాలివి. కడప నగరంలోని పెద్దదర్గా సమీపంలో ఉంటున్న మేడిశెట్టి నరసింహప్రసాద్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె పేరు భార్గవి. బీఎస్సీ చదివింది. ఎమ్మెస్సీ చదవాలనే ప్రయత్నంలో ఉంది. నరసింహప్రసాద్‌కు కంటి చూపు సమస్య ఉంది. దీంతో అతని భార్య పద్మావతి హోటల్‌లో పనిచేస్తోంది.  ఇద్దరు కుమార్తెలను తల్లి కష్టపడి చదివిస్తోంది. భార్గవి కొద్దినెలలుగా చిన్నచౌక్‌ బుడ్డాయపల్లెకు చెందిన భోగ శ్రీనివాసులు అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు డిగ్రీ పూర్తి చేశాడు. ఇరువురు పెళ్లి  చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా మహానందికి వెళ్లి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయాన్ని ఫోన్‌లో తెలియజేసినట్లు సమాచారం.

రోదిస్తున్న మేడిశెట్టి భార్గవి కుటుంబ సభ్యులు 

గురువారం ఇంటికి వస్తామన్నారు. భార్గవి ప్రేమ వివాహం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. విషయం తెలిసి తమ కుమార్తెను వారు మందలించారు. ఇంటికి వెళ్లితే కుటుంబ సభ్యులు ఏం చేస్తారోనని వీరు భయపడ్డారు. దీంతో ఇంటికి వెళ్లలేదు. గురువారం ఉదయం జమ్మలమడుగు మండలం గండికోటకు వెళ్లారు. ముందే అనుకున్న ప్రకారం తమ వెంట పురుగుల మందు తెచ్చుకున్నారు. కలిసి చనిపోదామని ఇద్దరూ దానిని తాగారు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వీరిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో ఇద్దరినీ జమ్మలమడుగు ప్రభుత్వాసుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్గవి మృతి చెందింది. శ్రీనివాసులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇతడ్ని మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు.  యువకుడి వివరాలు తెలియాల్సి ఉందని అర్బన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా