ప్రేమికురాలి ఆత్మహత్య

19 May, 2018 12:53 IST|Sakshi
రజని (ఫైల్‌)

ప్రేమికుడి నుంచి విడదీశారంటూ

బహుళ అంతస్తు భవనంపై నుంచి దూకిన యువతి

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : ప్రేమించి పెళ్లాడిన ప్రియుడిని దూరం చేయటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేని ఆ యువతి బహుళ అంతస్తుపై నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వాంబేకాలనీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబేకాలనీ హెచ్‌ బ్లాకుకు చెందిన తమ్మిశెట్టి రజని(19) పాలిటెక్నిక్‌ చదువుకుంది. డోర్నకల్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుంది. అక్కడే రూం బాయ్‌గా పనిచేస్తున్న గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు.

పెద్దలకు తెలియకుండా ఈ నెల 16వ తేదీన ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదులో వివాహం చేసుకున్నారు. ఆస్పత్రికి  వెళ్ళిన రజని తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన దుర్గ మరుసటి రోజు నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో తన కుమార్తె కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దుర్గ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రజని, గోపి హైదరాబాదులో ఉన్నట్లు తెలుసుకున్నారు. విషయం దుర్గకు చెప్పడంతో ఆమె రజనికి ఫోన్‌ చేసి ఇంటికి వచ్చేయమని వేడుకుంది. ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని తెలిపింది. రజని, గోపి ఇంటికి వచ్చేశారు. గోపీ మైనర్‌ అని తేలడంతో స్టేషన్‌కు వెళ్లిన ఇరు వర్గాల పెద్దలు రెండేళ్ల తర్వాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు రజనిని తల్లి దుర్గకు అప్పగించి ఇంటికి పంపేశారు.

గోపిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమించి వివాహం చేసుకున్న తమను పెద్దలు విడదీశారంటూ మనస్తాపానికి గురైన రజని శుక్రవారం మధ్యాహ్నం తల్లి దుర్గ ఇంట్లో వంట చేస్తుండగా మేడపై నుంచి బలవంతంగా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రజని అక్కడిడక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రజని ఆత్మహత్యకు గల కారణా లపై ఆరా తీశారు. కేసు నమోదుచేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాçప్తు చేస్తున్నట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు.

మరిన్ని వార్తలు