ప్రేమకథ విషాదాంతం

22 May, 2019 12:00 IST|Sakshi
మార్చురీలో కానిస్టేబుల్, ప్రేయసి మృతదేహాలు

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌బాబు (30) ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపం చెంది  ప్రేయసితో కలిసి కానిస్టేబుల్‌ వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వేట్రాక్‌పై  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన శాంతయ్య, కాంతమ్మ దంపతులకు మొత్తం నలుగురు సంతానం కాగా ముగ్గురు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరు ఆర్మీ ఉద్యోగి. నాల్గవ కుమారుడైన రమేష్‌బాబు. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో అడుగుపెట్టాడు. మొట్టమొదటి పోస్టింగ్‌ వన్‌టౌన్‌ స్టేషన్‌కు కేటాయించారు. దాదాపు ఆరేళ్లుగా ఒకే పోలీసుస్టేసన్‌లో పనిచేస్తున్నారంటే విధి నిర్వహణలో ఆయన నిజాయితీ అర్థం చేసుకోవచ్చు. బ్లూకోల్ట్‌ కానిస్టేబుల్‌గా మంచి సేవలందించాడు.

స్టేషన్‌ పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా నిమిషాల్లో బ్లూకోల్ట్‌ సిబ్బంది స్థానంలో వెళ్లేవాడు. రమేష్‌బాబు పనితీరుకు గుర్తింపుగా పలుమార్లు ఉత్తమ పోలీసు అవార్డును ఎస్పీ అశోక్‌కుమార్‌చేతుల మీదుగా అందుకున్నారు. ఎంతో చలాకీగా పనిచేసే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. ఏనాడు కుటుంబసమస్యలను బయటకు చెప్పుకునే వాడు కాదు. జూన్‌ 5, 6 తేదీల్లో వివాహం కావాల్సి ఉంది. స్వగ్రామంలోనే శామ్యూల్, రాజమ్మ దంపతుల కుమార్తె సవితను రమేష్‌బాబు ప్రేమించాడు. అయితే వీరి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలపకపోవడం... పెద్దలు నిశ్చయించిన మరొక యువతితో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన రమేష్‌బాబు తన ప్రేయసితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు