కట్నం కోసం వేధింపు.. ప్రేమికుడిపై క్రిమినల్‌ కేసు

5 Jan, 2020 11:07 IST|Sakshi

బంజారాహిల్స్‌ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం ఇస్తేనే పెళ్లి అంటూ పీటముడి వేసి వేధిస్తున్నందుకు ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని ఓ బస్తీలో నివసించే యువతి(22) డీ మార్ట్‌ మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రెండేళ్లుగా స్థానికంగా నివసించే లక్ష్మణ్‌ను ప్రేమిస్తోంది. ఈ నెల 2వ తేదీన లక్ష్మణ్‌ ఆమెను పెళ్లి విషయంలో మాట్లాడుకుందామని పిలిపించాడు. మాటల సందర్భంలో రూ.10 లక్షలు కట్నంగా ఇస్తే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వెళ్లిపో అని చెప్పాడు.

అంత డబ్బు తామిచ్చుకునే పరిస్థితిలో లేమని ఆమె చెప్పింది. తెల్లవారి మళ్లీ ఆమె లక్ష్మణ్‌కు ఫోన్‌ చేసింది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా ఇప్పుడే.. చచ్చిపో అంటూ లక్ష్మణ్‌ చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రమనస్థాపానికి గురై తన ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి గమనించి వెంటనే అప్రమత్తమై అపోలో ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు లక్ష్మణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 417, 420, వరకట్న నిషేధిత చట్టం కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు