బాలిక దారుణ హత్య

25 Jan, 2020 01:13 IST|Sakshi
నిందితుడు సోహెబ్‌ 

దూరం పెడుతోందనే అక్కసుతో ప్రియుడి ఘాతుకం

రాయితో కొట్టి,  భవనంపై నుంచి తోసేసిన వైనం

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

చిలకలగూడ : పెళ్లికి నిరాకరిస్తూ తనను దూరం పెడుతుందనే అక్కసుతో బాలికను రాయితో కొట్టి చంపి, భవనం పైనుంచి కిందికి పడేశాడో ఉన్మాది. ఈ ఘోర ఘటనలో నిందితుడిని పోలీసులు సాయంత్రానికల్లా అరెస్టు చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ వారాసిగూడకు చెందిన బాలిక(17) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈమె తండ్రి మూడేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ బాలిక స్కూల్‌లో చదువుతున్నప్పుడు తనకన్నా రెం డేళ్లు సీనియర్‌ అయిన సోహెబ్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఫ్లెక్సీ బోర్డులు తయారు చేసే సోహెబ్‌ 3 నెలల క్రితం ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. పెద్దలసమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. 

కక్ష పెంచుకున్న సోహెబ్‌...
ఈ క్రమంలో సోహెబ్‌ ఆ బాలిక తనను దూరంగా ఉంచుతోందని భావించి కక్ష పెంచుకున్నాడు. గురువారం బాలిక ఇంటి కింది పోర్షన్‌లో ఉండే వారింట్లో ఓ శుభకార్యం జరిగింది. అందరూ ఆ హడావుడిలో ఉండగా ‘నీతో అత్యవసరంగా మాట్లాడాలి, ఇంటి టెర్రస్‌ పైకి రా’అంటూ బాలికకు సోహెబ్‌ మెసేజ్‌ పెట్టాడు. ఆమె టెర్రస్‌పైకి వెళ్లడంతో సోహెబ్‌ మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన సోహెబ్‌.. బాలిక నోరు నొక్కి గ్రానైట్‌ రాయితో గొంతులో పొడిచి చంపేశాడు. బాలిక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి భవనం (మూడంతస్తులు)పై నుంచి కింది పడేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. 

హత్య చేసినట్లు అంగీకారం...
శుక్రవారం ఉదయం నిద్రలేచిన బాలిక తల్లి కుమార్తె కోసం వెతికింది. ఈ క్రమంలో టెర్రస్‌ మీదికి వెళ్లి చూసింది. అక్కడ రక్తపు మరకలు చూసి భయాందోళనకు గురై కిందికి వెళ్లి చూడగా... పక్క భవనానికి, తమ భవనానికి మధ్య ఉన్న ఖాళీలో బాలిక మృతదేహం కనిపించింది. స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి చెప్పిన వివరాలతో సోహెబ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు రక్తపు మరకలతో ఉన్న సోహెబ్‌ దుస్తులు, బూట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ 302, 201, 354–డీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాలిక ఇటీవల మరొకరితో చాటింగ్‌ చేస్తూ తనను దూరంగా పెడుతోందని అపార్థం చేసుకున్న సోహెబ్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు బాలిక ఒంటిపై మొత్తం 11 చోట్ల గాయాలు గుర్తించారు. పదునైన రాయితో గొంతులో పొడవడం వల్లే మరణం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం బాలిక మృతదేహం నుంచి విస్రా నమూనాలు, స్వాబ్స్‌ సేకరించారు. వీటిని రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపనున్నారు. ఈ బాలికకు పోలీసులు నజ్మా అనే పేరు పెట్టారు. 

మరిన్ని వార్తలు