ప్రియుడిని గాయపర్చిన ప్రియురాలు

26 May, 2020 07:39 IST|Sakshi

ప్రియుడిని గాయపర్చిన ప్రియురాలు

పెళ్లికి అంగీకరించకపోవడంతోనే దాడికి యత్నం

ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం  

చల్లపల్లి(అవనిగడ్డ): ప్రియుడిపై కత్తితో దాడి చేసి ఆపై ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మచిలీపట్నంకు చెందిన మాగంటి నాగలక్ష్మి ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్‌కుమార్‌ పెడన తహసీల్దార్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

కొంత కాలంగా తనను వివాహం చేసుకోవాలని నాగలక్ష్మి ఒత్తిడి చేయడంతో ఆ ప్రతిపాదనను అతను తిరస్కరిస్తూ వచ్చాడు. ఇంట్లో ఒప్పుకోరని ప్రియుడు వాదించడంతో ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పి సోమవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం వక్కలగడ్డలోని తనకు తెలిసిన యువతి ఇంటికి తీసుకెళ్లింది. మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగింది. పవన్‌కుమార్‌ ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా కత్తి తీసి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గదిలో వినిపిస్తున్న కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో చల్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మినీ, గాయాలతో ఉన్న పవన్‌కుమార్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ  ఎన్‌.వెంకట నారాయణ, ఎస్‌ఐ పి.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా