లలితా జ్యువెలర్స్‌ చోరీ కేసులో ప్రేమజంట అరెస్ట్‌

19 Dec, 2017 09:32 IST|Sakshi

లలిత జ్యువెలర్స్‌లో 66 గ్రాముల పసిడి కేసు

 ఓ ప్రేమజంట పనిగా నిర్థారించిన పోలీసులు

 ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వైనం

 సొత్తు నందిగామలో తాకట్టు పెట్టినట్లు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌ : పంజగుట్ట పరిధిలోని సోమాజిగూడ సర్కిల్‌లో ఉన్న లలితా జ్యువెలర్స్‌ సంస్థలో గత సోమవారం చోటు చేసుకున్న ‘రెండో చోరీ’ కేసును పంజగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రేమజంటను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు జ్యువెలర్స్‌లో తస్కరించిన సొత్తును తమ స్వస్థలానికి తీసుకువెళ్ళి అక్కడున్న ఓ ఫైనాన్స్‌ సంస్థలో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో ఆ బంగారం రికవరీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్‌ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్‌ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రేమజంట తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలితా జ్యువెలర్స్‌పై పడింది.

గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో వీరిద్దరూ జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ దుకాణం మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా మార్చుకున్న ఈ వీరు వివిధ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్‌ దృష్టిని మళ్ళించింది. అదును చూసుకుని అక్కడి కౌంటర్‌లో ఉన్న రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్‌లెట్‌ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్‌ సరిచూడగా తేడా కనిపించింది.

దీంతో మంగళవారం పూర్తిస్థాయి ఆడిగింగ్‌ నిర్వహించిన యాజమాన్యం 66 గ్రాముల బరువుతో ఉన్న ఐదు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా బుధవారం సంస్థకు చెందిన జి.మధుసూదన్‌ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో చోరీ సొత్తును కరీముల్లా నందిగామలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో రూ.1.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. దీంతో ఆ సొత్తు రికవరీ చేయడానికి పంజగుట్ట పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

కోఠిలో ‘ఆగిన’ మొదటి కేసు...
ఈ నేరం జరగడానికి ముందే ఈ నెల 3న లలితా జ్యువెలర్స్‌లో ఓ దొంగతనం జరిగింది. బురఖా ధరించిన వచ్చిన ఇద్దరు మహిళలు రూ.6 లక్షల విలువైన 20 తులాల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్ళారు. సేల్స్‌మెన్‌ దృష్టి మళ్ళించి బంగారు నెక్లెస్‌ స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ది ఉంచారు. దీన్ని బట్టి ఆ నిందితులు అంతకు ముందే షోరూమ్‌కు వచ్చి ఉంటారని, అప్పడే ఫొటో తీసుకుని వెళ్ళి రోల్డ్‌గోల్డ్‌ది తయారు చేయించి ఉంటారని పోలీసులు అనుమానించారు. నిందితులు ప్రయాణించిన ఆటో ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఆ నిందితురాళ్ళు దుకాణానికి వచ్చిన ఆటోను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.

ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆ రోజు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు కోఠిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు కూడలివద్ద తన ఆటో ఎక్కినట్లు వెల్లడించాడు. దీంతో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లు సేకరించిన పరిశీలించారు. వీటిలో ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో ఆ కేసు దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది. చోరీ దొంగతనం అనంతరం బుర్ఖా ధరించిన మహిళలు ఎక్కిన ఆటో వివరాలు తెలిస్తే ఫలితం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఆటో వెళ్ళిన మార్గంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు వీరి ఎక్కిన ప్రాంతంలో లేకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు.

లలితా జ్యువెలర్స్‌ చోరీ కేసులో ప్రేమజంట అరెస్ట్‌

మరిన్ని వార్తలు